నాగపంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏమిచేయాలి... ఏమి చేయకూడదు?

 నాగపంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏమిచేయాలి... ఏమి చేయకూడదు?

ఆగస్టు  21వ తేదీన నాగపంచమి.  నాగపంచమి గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైంది. ఆరోజు(ఆగస్టు  21) ద్వారానికి ఇరువైపులా నాగదేవత చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. ఈ పండగ విశిష్టత ఏమిటి? దీనిని ఎలా జరుపుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. 

శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా  వ్రత గ్రంథాలు   పేర్కొంటున్నాయి.  నాగపంచమి రోజున (ఆగస్టు 21)  ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించాలని  హేమ పురాణంలో చెప్పినట్లు ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు.  నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు  హేమాద్రి ప్రభాస ఖండంలో ఉంది. నాగపంచమి రోజు భూమి దున్నకూడదని అంటారు. అయితే నాగపంచమని విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ మాసంలో నాగపంచమిగా జరుపుకుంటే, ఆంధ్ర ప్రదేశ్‍లో మాత్రం కార్తీక మాసంలో నాగులను పూజిస్తారు.

నాగ పంచమి ఎలా చేస్తారు?

 శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును ( ఆగస్టు 21)  నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజని పురాణాలు చెబుతున్నాయి. నాగులచవితి మాదిరిగానే నాగ పంచమి  నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుంటారు. తర్వాత తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేస్తారు.ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు పెడతారు. గంధం చిలకరిస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు. పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.

నాగ పంచమి పూజకు శుభ సమయం

నాగ పంచమి తిథి ఆగస్టు 21న మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 22, మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ పండుగ ఆగష్టు 21న మాత్రమే జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తు న్నారు. పూజకు అనుకూలమైన సమయం ఆగస్టు 21, సోమవారం. ఉదయం 5.53 నుండి 8.30 వరకు శుభ ముహూర్తంలో నాగదేవతని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయని విశ్వాసిస్తుంటారు.

  • విషాణి తస్య నశ్యంతి న టాం హింసంతి పన్నగాః
  • న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్

 అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి.

నాగ పంచమి ప్రాముఖ్యత

శివుని మెడలోని ఆభరణం నాగుపాము. శ్రావణ మాసంలోని నాగ పంచమి రోజున నాగ దేవతని పూజిస్తే జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం. ఈ రోజున ( ఆగస్టు21) పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పాముల బాధల నుంచి కుటుంబానికి రక్షణ లభిస్తుందని విశ్వాసం.

నాగ పంచమి రోజున చేయాల్సినవి

  • నాగ పంచమి రోజున పాములకు పాలు సమర్పించండి
  • నాగదేవతని పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పూజించి, ఆపై అతని హారతి చేయండి
  • ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషాన్ని తొలగించడానికి, ప్రవహించే నీటిలో వెండితో చేసిన ఒక జత పాములను  సమర్పించండి
  • నాగ పంచమి రోజున ఒక జత వెండి నాగు పామును బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సంపదలు, ధాన్యాలు పెరుగుతాయి
  • పాముల నుంచి తమకు , తమ కుటుంబానికి భయం ఉండదని విశ్వాసం
  • పాముల( శుభ్రమణ్యేశ్వర స్వామికి) కు పాలను నివేదనగా సమర్పించాలని చెబుతున్నారు
  •  పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం సమర్పించాలి

చేయకూడని పనులు

  • నాగ పంచమి రోజున పాములను  హాని చేయకూడదు 
  • కొంతమంది పాములను ఆడిస్తూ  సొమ్ము చేసుకుంటుంటారు.  సాక్షాత్తూ శుభ్రమణ్య స్వామిగా ఆరాధించే పాములను ఆడించడం మంచిదికాదని పండితులు సూచిస్తున్నారు
  • పాము కనిపిస్తే దూరం పాటించి దండం పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.  అంతేకాని వాటిని రెచ్చగొట్టడం లాంటి పనులను చేయకూడదని చెబుతున్నారు పాములు పట్టే నిపుణులకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా ప్రయత్నించండి

నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

నాగ పంచమి, కాలసర్ప దోష నివారణ

కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.