
న్యూఢిల్లీ: ఇండియా టాప్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్.. రెండేళ్ల తర్వాత డేవిస్ కప్ జట్టులోకి తిరిగి వచ్చాడు. డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ భాంబ్రీ కూడా మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. వరల్డ్ గ్రూప్–1 తొలి రౌండ్‌లో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి స్విట్జర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం ఎనిమిది మందితో కూడిన ఇండియా జట్టును ఏఐటీఏ శుక్రవారం ప్రకటించింది. బీల్‌లోని ఇండోర్ కోర్టుల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 2023 లక్నోలో మొరాకోతో జరిగిన చివరి హోమ్ మ్యాచ్‌లో నగాల్ బరిలోకి దిగాడు. రెండు సింగిల్స్‌లోనూ నగాల్ నెగ్గడంతో ఇండియా 4–1తో గెలిచింది. ఇక ఫిబ్రవరి 2024లో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం అతను ఆ దేశానికి వెళ్లలేదు.
ఆ తర్వాత స్వీడన్, టోగోతో జరిగిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. మరోవైపు నగాల్ ఫామ్‌లో లేకపోవడంతో ఈ సీజన్‌లో అతని ర్యాంక్ 306కి పడిపోయింది. ఈ నెలలో ఇటలీలో జరిగిన ట్రీస్టే చాలెంజర్‌లో సెమీస్‌కు చేరడం అత్యుత్తమ ప్రదర్శన. ఇండోర్ కోర్టుల్లో జరిగే మ్యాచ్‌లు చాలా వేగంగా ఉంటాయి. కానీ నగాల్ ఆట నెమ్మదిగా ఉండటంతో ఎలా ఆడతాడన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. స్విస్‌తో సింగిల్స్ మ్యాచ్‌లకు కరణ్ సింగ్ (103), ఆర్యన్ షా (442)లను తీసుకున్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా రిత్విక్ బొల్లిపల్లి (77), శశి కుమార్ ముకుంద్ (463), దక్షిణేశ్వర్ సురేశ్ (790) ఉన్నారు.
యూకీ భాంబ్రీ (35), ఎన్. శ్రీరామ్ బాలాజీ (75) డబుల్స్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ‘నగాల్ ఆట నెమ్మదిగా ఉన్నా ఈ మ్యాచ్ కోసం కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాడు. గతంలో తన బెస్ట్ ఆటను చూపెట్టాడు. అదే కంటిన్యూ చేస్తాడని భావిస్తున్నాం. ఇక దక్షిణేశ్వర్‌ను చాలా రోజులుగా గమనిస్తున్నాం. అతని హార్డ్ కోర్ట్ గేమ్ బాగుంది. 6 అంగుళాల 5 ఇంచ్‌లు ఉండటంతో పెద్ద సర్వ్‌లను చేయగలడు. ఫాస్ట్ ఇండోర్ కోర్టుల్లో ఇది అతనికి బలంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో అతను కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నాం.
ప్రాక్టీస్, ఫామ్, ఫిట్‌నెస్, మ్యాచ్ షార్ప్‌నెస్‌ను చేసిన జట్టును ఎంపిక చేస్తాం’ అని కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ అన్నాడు. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో స్విట్జర్లాండ్ 1–3తో స్పెయిన్ చేతిలో ఓడింది. దీంతో ఎలాగైనా ఇండియాతో జరిగే మ్యాచ్‌లో గెలవాలని వాళ్లు కోరుకుంటున్నారు. జెరోమ్ కిమ్ (145), స్టాన్ వావ్రింకా (156), మార్క్ ఆండ్రియా హ్యూస్లర్ (170), డొమినిక్ స్ట్రైకర్ (205) జట్టులో ఉన్నారు.