ముహుర్తం చూసుకుని త్వరలో బీఆర్ఎస్​లో చేరుతా : నాగం

ముహుర్తం చూసుకుని త్వరలో బీఆర్ఎస్​లో చేరుతా : నాగం

తాను ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే విషయం ముందే చెప్పానన్నారు నాగం జనార్ధన్ రెడ్డి. తనకు జరిగిన అవమానంతో కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని.. బీఆర్ఎస్ లో చేరుతానని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందన్నారు. 

సీఎం కేసీఆర్ కు నాగం జనార్ధన్ రెడ్డి చిరకాల మిత్రుడు అని చెప్పారు మంత్రి కేటీఆర్. నాగం పుట్టు తెలంగాణ వాది అని.. రాష్ట్రం సిద్దించాలని కోరుకున్న వ్యక్తి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నాగం జనార్ధన్ రెడ్డిని తాము ఆహ్వానించామని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత  నాగం జనార్ధన్ రెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయ అనుభవం స్థాయికి తగ్గట్లు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరం సమిష్టిగా వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తామని చెప్పారు. 

అంతకుముందు.. హైదరాబాద్ లోని నాగం నివాసానికి నాగర్ కర్నూల్ ఎమ్యెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నాగం.. కొద్దిరోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో తన అనుచరులతో చర్చల అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడారు.