- రేసులో కల్వకుర్తి, ఉర్కొండ జడ్పీటీసీలు
- మంత్రి నిరంజన్ రెడ్డి చుట్టూ చక్కర్లు
- స్టే కోసం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు పద్మావతి ప్రయత్నాలు
నాగర్‌కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నట్లు రుజువు కావడంతో తెల్కపల్లి జడ్పీటీసీగా ఆమె ఎన్నిక చెల్లదని ఎలక్షన్ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌లో హడావుడి మొదలైంది. పలువురు జడ్పీటీసీలు జడ్పీ కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్‌తో పాటు ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఊర్కొండ జడ్పీటీసీ శాంతికుమారి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పద్మావతి స్టే కోసం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ట్రిబ్యునల్ ఆర్డర్ చేతికి రాగానే ఫైల్ చేయనున్నట్లు తెలిసింది.
జడ్పీటీసీగా ప్రమాణం చేయించాలి
ఇదిలా ఉండగా తెల్కపల్లి జడ్పీటీసీగా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని పద్మావతి సమీప అభ్యర్థి సుమిత్ర శనివారం కలెక్టరేట్, జడ్పీ ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చారు. కోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు అందలేదన్న జడ్పీ ఆఫీసర్లు కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెడతామని ఆయన నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు సోమవారం అఫిషియల్‌గా అందే అవకాశం ఉంది. జడ్పీ సీఈవో నోట్‌ఫైల్ పెట్టి కలెక్టర్అప్రూవల్ తీసుకుంటే రెండు రోజుల వ్యవధిలో తెల్కపల్లి జడ్పీటీసీగా సుమిత్ర, చైర్మన్‌గా వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌తో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. జడ్పీ నోట్ ఫైల్, కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడానికి గ్యాప్ దొరికితే పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. ఈ లోగా పద్మావతికి హై కోర్టులో స్టే లభిస్తే కొంత కాలం కంటిన్యూ అవుతారు. ఇదంతా పొలిటికల్ లీడర్ల ఆదేశాలు, అధికార యంత్రాంగం అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది.
రేసులో ఇద్దరు
హైకోర్టులో పద్మావతికి స్టే దొరకకపోతే జడ్పీ చైర్‌పర్సన్ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఊర్కొండ జడ్పీటీసీ శాంతకుమారిలలో ఒకరికి చాన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వాళ్లు ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రూల్స్ ప్రకారం జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్‌కు తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలు అప్పగించాల్సి ఉండడంతో తనకే పూర్తిస్థాయిలో అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే జిల్లా ఎమ్మెల్యేలు మద్దతిస్తారా.. లేదా.. ? అనేది
సస్పెన్స్‌గా మారింది.
ఎమ్మెల్యేల మద్దతెవరికో..?ః
జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని జడ్పీ మీటింగుల్లో ప్రస్తావించడమే కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఆస్పత్రి కమిటీ ఏర్పాటు విషయంతో పాటు సమస్యలపై జిల్లా స్థాయి అధికారులు స్పందించడం లేదని అంతా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే నడుస్తోందని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఈ విషయాలు ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదని పార్టీ నేతలే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పద్మావతి స్టే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇచ్చేది డౌటేనని వినికిడి. జడ్పీ కుర్చీ రేసులో ఉన్న కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఊర్కొండ జడ్పీటీసీ శాంతికుమారి విషయంలోనే వాళ్లు చెప్పినట్లు వినేవాళ్లకే మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
