
- కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : యువతకు విజ్ఞానం అందించేందుకు జిల్లాలో 29 డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో సీఎస్ఆర్ ద్వారా రూ.కోటీ 20 లక్షలు నిధులతో 50 డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
ఒక్కో గ్రంథాలయ నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తిలో 8, కొల్లాపూర్లో 7, నాగర్‌కర్నూల్ లో 7, అచ్చంపేటలో 7 డిజిటల్ గ్రంథాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రంథాలయాల ఏర్పాటుకు స్థలాల సేకరణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ పాల్గొన్నారు.