నాగార్జున సాగర్ డ్యాం వివాదం: డిసెంబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

నాగార్జున సాగర్ డ్యాం వివాదం: డిసెంబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జల శక్తిశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా  డిసెంబర్ 6 న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల సిఎస్ లు, ఇతర అధికారులతో  కేంద్ర జల శక్తిశాఖ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించనుంది.  కృష్ణా జలాల పంపకంపై నెలకొన్న వివాదానికి పరిష్కారించడంతోపాటు.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా  నిర్వహణ అంశాలపై చర్చించనుంది.

ఈ అంశాలపై డిసెంబర్ 2వ తేదీ శనివారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో  వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అయితే, ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని.. 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని  తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6 వ తేదీన కేంద్ర జల శక్తిశాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది.

అప్పటివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. అలాగే, నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీ సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుందని.. ఆ తర్వాత నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని దేబశ్రీ ముఖర్జీ, కేఆర్ఎంబి ఛైర్మన్ శివనందన్ ను ఆదేశించారు.  అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని  కేంద్ర జలశాఖ కోరింది.  ఈనెల 6 వ తేదీన అన్ని అంశాలపై చర్చించి వివాదం పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.  

ఈవీడియో సమావేశంలో విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు.  నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను సిఎస్ వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని ఆరోపించారు.  రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.  6వ తేదీన జరిగే సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావిస్తామని ఏపీ  సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.