
హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో మంగళవారం (జూలై 29) మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి, సాగర్ ఎమ్మెల్యే రఘవీర్ రెడ్డి సాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఓపెన్ చేశారు. ముందుగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటిని కిందికి వదిలారు.
సాగర్ గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. 18 ఏండ్ల తర్వాత జూలైలోనే సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ఠ స్ధాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది.
గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఓపెన్ చేసి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసి పులకించిపోయేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు క్యూ కడుతున్నారు. పర్యాటకులతో సాగర్ ప్రాజెక్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.