కృష్ణమ్మ పరవళ్లు… నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్

కృష్ణమ్మ పరవళ్లు… నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్

రాష్ట్రంలో కృష్ణమ్మ  పరవళ్లు  కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి  భారీగా వరద వస్తుండటంతో..  నాగార్జున సాగర్ కు  రికార్డు  స్థాయిలో  వరద ప్రవాహం  వస్తోంది. దీంతో 17 గేట్లు  ఎత్తి… నీటిని  దిగువకు  వదులుతున్నారు.  సాగర్ ప్రాజెక్ట్ కు  9 లక్షల  క్యూసెక్కులకు  పైగా  ఇన్ ఫ్లో  వస్తోంది. పెరుగుతున్న  ఇన్ ఫ్లో  ఆధారంగా గంట గంటకు  గేట్లను  ఎత్తుతున్నారు అధికారులు. ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్  పూర్తిస్థాయి  నీటిమట్టం.. 590 అడుగులు  కాగా.. ప్రస్తుతం  560 అడుగులకు  చేరింది. సాగర్ సామర్థ్యం  312 టీఎంసీలు  కాగా.. ప్రస్తుతం  ప్రాజెక్ట్  230 టీఎంసీలకు  నీటి  నిల్వ  చేరుకుంది.  గేట్లు  ఎత్తడంతో  సాగర్ పరివాహక  ప్రాంత  ప్రజల్ని అప్రమత్తం  చేశారు అధికారులు.

నారాయణపూర్  నుంచి  భారీగా వరద  వస్తుండటంతో.. శ్రీశైలం  ప్రాజెక్ట్ కు  వరద పోటెత్తింది.  అటు  తుంగభద్ర  నుంచి  నీళ్లు విడుదల  కావడంతో  శ్రీశైలానికి వరద అంతకంతకు  పెరుగుతోంది. జూరాల  నుంచి  కేవలం 13 రోజుల్లోనే ….359 టీఎంసీల నీరు  శ్రీశైలానికి  చేరుకుంది. 24 గంటల్లో  శ్రీశైలం నుంచి  దాదాపు 60  టీఎంసీలకు పైగా విడుదల  చేశారు. ప్రస్తుతం  శ్రీశైలానికి  7లక్షల  47వేల  క్యూసెక్కులకు  పైగా  వరద  వస్తుండంటంతో.. 10గేట్లను  ఎత్తి.. 8లక్షల  50వేల  క్యూసెక్కుల  వరదను  కిందికి  వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి  సామర్థ్యం  215  టీఎంసీలు  కాగా.. ప్రస్తుతం  181 టీఎంసీల  నిల్వ ఉంది.

తుంగభద్ర  వరద..  కర్ణాటక దాటి..  AP, తెలంగాణ  సరిహద్దుల్లోకి  చేరింది. RDS ఆనకట్ట  వద్ద….తుంగభద్ర వరద  ప్రవహిస్తోంది. ఆర్డీఎస్ కు   15 అడుగుల వరద  వస్తోంది.  మొత్తం  లక్షా 71వేల  క్యూసెక్కుల  ఇన్ ఫ్లో  వస్తుంది. సుంకేశుల జలాశయానికి చేరుకున్న తుంగభద్ర వరద మధ్యాహ్నం వరకు  శ్రీశైలం కు… తుంగభద్ర  నీళ్లు   తోడయ్యే  అవకాశం ఉంది. మరోవైపు  జూరాలకు భారీగా వరద  వస్తుండటంతో.. చాలా  గ్రామాలు నీట  మునిగాయి. లింక్ రోడ్లు  తెగిపోయి జనం తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు.  ముంపు గ్రామాల  ప్రజలను  అధికారులు  ఇప్పటికే సురక్షిత  ప్రాంతాలకు తరలించారు.