
నాంకేతికత అందిస్తున్న అపారమైన అవకాశాలతో పాటు దాని దుర్వినియోగం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)ను అడ్డుపెట్టుకోని అడ్డదారులు తొక్కుతున్న తీరును చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన పేరు, ఇమేజ్ ను అక్రమంగా వాడుకుంటూ, మార్ఫింగ్ వీడియోలను సృష్టిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
AI సాంకేతికతతో నాగార్జున ఫొటోలు మార్ఫింగ్ ..
నాగార్జున తరపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో, తన క్లయింట్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలు, వీడియోలు, పేరును ఉపయోగించి వివిధ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికలు అక్రమంగా వ్యాపారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, AI సాయంతో యూట్యూబ్ షార్ట్స్, ఇతర వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున పేరుతో హ్యాష్ ట్యాగ్‌లు ఇవ్వడం ద్వారా అపారమైన సొమ్ము సంపాదిస్తున్నారని తెలిపారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, AI సాంకేతికతను ఉపయోగించి నాగార్జున ఫొటోలను మార్ఫింగ్ చేసి,అసభ్యకరమైన కంటెంట్, లింకులను సృష్టిస్తున్నారని, ఇది ఆయన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తోందని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీ హైకోర్టు స్పందన
కేవలం వీడియోలే కాకుండా, ఫోటోలను టీ-షర్టులు, ఇతర వస్తువులపై ముద్రించి వ్యాపారం చేస్తున్నారని, ఇది పూర్తిగా వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఐశ్వర్య రాయ్ ఫొటోలను ఉపయోగించి అక్రమంగా సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫొటోలను కూడా వాడుకుంటున్నారని నాగార్జున పేర్కొన్నారు. ఈ దుర్వినియోగానికి పాల్పడుతున్న 14 వెబ్‌సైట్‌లు తక్షణమే ఆ లింకులను, కంటెంట్‌ను తొలగించాలని నాగార్జున డిమాండ్ చేశారు. నాగార్జున దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం విచారించింది. అక్రమంగా మార్ఫింగ్ కంటెంట్ సృష్టించడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, నాగార్జున పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడతామని భరోసా ఇచ్చింది.
నిజానికి, ఇలాంటి కేసుల్లో ఢిల్లీ హైకోర్టు గతంలోనే కీలక తీర్పులు ఇచ్చింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వంటి ఎంతో మంది నటీనటులు తమ పేరు, ఇమేజ్‌ను వాణిజ్య అవసరాలకు వాడుకోకుండా నిరోధించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నటుల అనుమతి లేకుండా వారి పేరును, ఇమేజ్‌ను ఏ రూపంలోనూ వాడుకోకూడదని ఢిల్లీ హైకోర్టు అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది శుభపరిణామం.
ఈ పరిణామం, డీప్‌ఫేక్ (Deepfake) సాంకేతికత , AI దుర్వినియోగంపై సెలబ్రిటీలు తీసుకుంటున్న చట్టపరమైన చర్యలకు మరింత బలం చేకూర్చింది. భవిష్యత్తులో, డిజిటల్ వేదికలపై వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఈ కేసు ఒక కీలక ఉదాహరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.