మా సర్టిఫికెట్లనూ అనుమతించండి

మా సర్టిఫికెట్లనూ అనుమతించండి
  • మంత్రి హరీశ్​రావును కలిసిన డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్​ఎడ్యుకేషన్​లో చదివిన తమ సర్టిఫికెట్లను అనుమతించాలని పలువురు స్టూడెంట్స్​ మంత్రి హరీశ్​రావును కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలోనే ఎగ్జామ్స్​ రాశామని, జురీస్​డిక్షన్​ పేరుతో తమ సర్టిఫికెట్లు చెల్లవని చెబుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జున వర్సిటీ డిస్టెన్స్​లో చదువుకున్న స్టూడెంట్స్​ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటారని, ఇప్పుడు వాళ్లంతా జాబులకు అనర్హులని చెప్పడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ప్రతి నోటిఫికేషన్​లో ఆ నిబంధనను పొందుపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులే డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​లో చదువుతారని, చదువులు పూర్తయ్యేవరకు స్టడీ సెంటర్లపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం న్యాయం కాదని వాపోయారు.  ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షల ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎడ్యుకేషన్​ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు స్టూడెంట్స్ తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌ లింబాద్రిని కలిసి వారి సమస్యను వివరించారు. ఈ విషయంపై యూజీసీకి లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు.