హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ వాయిదా పడింది. 2025, డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా వేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. నాగార్జున పిటిషన్‌పై గురువారం (నవంబర్ 13) కోర్టులో విచారణ జరగగా మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. ఆమె తరుఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది న్యాయస్థానం.
వివాదం ఏంటంటే..?
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్‌మీడియా లింక్స్‌తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్‌ఎస్ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణ నడుస్తోంది. 2025, నవంబర్ 13న ఈ పిటిషన్‌పై కోర్టులో మరోసారి విచారణ జరగగా కొండా సురేఖ హాజరు కాకపోవడంతో 2025, డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా పడింది.
►ALSO READ | Rajamouli: SSMB29 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు భద్రత కట్టుదిట్టం.. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ!
అయితే.. విచారణకు ఒకరోజు ముందు అంటే.. 2025, నవంబర్ 12న నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ‘‘నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే చింతిస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.
