నాగార్జునసాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతిలోనే

నాగార్జునసాగర్ డ్యామ్  కేంద్ర బలగాల చేతిలోనే
  •       ఫోటోలు తీసేందుకు  మీడియా కు నో ఎంట్రీ 
  •     అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అక్కడే మకాం  

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ డ్యామ్​ ఇంకా కేంద్ర బలగాల చేతిలోనే ఉంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగడానికి కొద్దిరోజుల ముందు కేంద్ర బలగాలు నాగార్జున సాగర్​ డ్యామ్​ మీద కాలుమోపాయి. కృష్ణా రివర్​ బోర్డు పరిధిలోకి ప్రాజెక్టు వెళ్లడంతో కేంద్రం ఆగమేఘాల మీద ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ వైపు నుంచి రెండు కంపెనీల బలగాలు ప్రస్తుతం కాపలా కాస్తున్నాయి. 

దీంతోపాటు అదనంగా ఎస్​పీఎఫ్​ సైతం డ్యాంపైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. వీరు మూడు షిఫ్టుల్లో డ్యూటీలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి ఎవరూ కూడా డ్యామ్​పై అడుగుపెట్టకుండా చూస్తున్నారు. సివిల్ ​పోలీసులకు సైతం డ్యామ్​పైకి ఎంట్రీ లేదు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్​ రిజర్వాయర్​లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఎప్పటికప్పుడు వాటర్​ లెవల్​ వివరాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్ట్​  నీటి మట్టాల ఫొటోలు తీసుకునేందుకు కూడా మీడియాను అనుమతించడం లేదు. 

రెండు రోజులుగా సాగర్​లో నీటి మట్టాలు ఫొటోలు తీయడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా డ్యామ్​మీదకు పోనివ్వకుండా భద్రత బలగాలు అడ్డుకున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తే ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని షరతు విధించారు. అది కూడా వాటర్ ​లెవల్స్​కనిపించే చానల్​ వరకు మాత్రమే పర్మిషన్​ ఇస్తున్నారు. 

సాగర్​కు పెరిగిన వరద..

నాగార్జున సాగర్​ రిజర్వాయర్​లోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. మంగళవారం సాయంత్రం 6  గంటల వరకు అందిన సమాచారం మేరకు శ్రీశైలం నుంచి సాగర్​కు 1,55,716 క్యూసెక్కుల వరద వచ్చింది. సాగర్​నీటి మట్టం 517.20 అడుగులకు చేరింది. సోమవారంతో పోలిస్తే సుమారు 55 వేల క్యూసెక్కుల వరద ఎక్కువైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 144.2194 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 2.50 లక్షల క్యూసెక్కుల వరద బుధవారం సాగర్​లోకి చేరే అవకాశం ఉంది. 

వరద ఉధృతి పెరిగితే నాగార్జుసాగర్​ను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. సాగర్ ​గేట్లు కూడా ఎత్తాల్సిన పరిస్థితి వస్తే వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక మరింత పెరుగుతుంది. కానీ, కేంద్ర బలగాలు కాపలా కాస్తున్న నేపథ్యంలో పర్యాటకులు, అధికారులు డ్యామ్​మీదకు వెళ్లే అవకాశాలు ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.