
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి 65,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,108 క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు వరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో 589.30 అడుగుల ( 309.9534 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 5,800 క్యూసెక్కులు, కుడి కాల్వకు 7,086 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు 1,800 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 28,785 కలిపి మొత్తం 75,879 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
జూరాలకు 1.19 లక్షల ఇన్‌ఫ్లో
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తోంది. రిజర్వాయర్‌లోకి 1,19,425 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో సోమవారం 17 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో 318.516 మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచి.. 17 గేట్ల ద్వారా 1,19,425 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 29,479 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,50,304 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు.