అమ్రాబాద్, వెలుగు: చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు శాఖల సమన్వయం అవసరమని నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పేర్కొన్నారు. శుక్రవారం మన్ననూరులోని ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. చెంచు పెంటల్లోని పిల్లలందరూ బడికి వచ్చేలా చూడాలని, డ్రాప్‌అవుట్‌ల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు, పోషకాహారం అందేలా చూడాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ‘ఇందిరా సౌర గిరిజన విద్యుత్ పథకం’ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని విస్తరించాలన్నారు. చెంచు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
