అమ్రాబాద్, వెలుగు: గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను నాగర్కర్నూల్ జిల్లా పదర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.
అమ్రాబాద్ సీఐ ఎస్.చంద్రయ్య, పదర ఎస్సై ఎస్.వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన మదనాగుల మల్లయ్య మరికొందరితో కలిసి ఉడిమిల్ల గ్రామ శివారులోని వినాయకుడి మాన్యం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపాలని నిర్ణయించాడు. అచ్చంపేటకు చెందిన జేసీబీ డ్రైవర్ పుట్ట మల్లేశ్ ద్వారా ఐనోల్ గ్రామానికి చెందిన వడ్త్య ధర్మ జేసీబీని రూ.15 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు.
ఉడిమిల్ల గ్రామానికి చెందిన మేఘావత్ మోతీలాల్, కాస నాగరాజును కాపలాగా పెట్టుకున్నారు. ఈ నెల 24న రాత్రి ఆ ప్రాంతానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారు. నిధులు లభించకపోవడంతో వెళ్లిపోయారు.
మళ్లీ శుక్రవారం అదే ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు వెళ్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు మున్ననూరు చెక్ పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మదనాగుల మల్లయ్య, పుట్ట మల్లేశ్, వడ్త్య ధర్మ, మేఘావత్ మోతీలాల్, కాస నాగరాజును అరెస్ట్ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు.
