ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సహకరించాలి : ఎంపీ మల్లు రవి

ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సహకరించాలి : ఎంపీ మల్లు రవి
  •     నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరమని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద ప్రజలు ఆర్థికంగా ఎదగాలంటే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్వయం ఉపాధికి బ్యాంకులు సహకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని సూచించారు. 

స్వయం ఉపాధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి రుణాల మంజూరు స్పీడప్​ చేయాలని కోరారు. గత ఏడాది 5,241 మంది లబ్ధిదారులకు రూ.502 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లను ఎంపీ అభినందించారు. అడిషనల్​ కలెక్టర్  పి అమరేందర్, లీడ్  బ్యాంక్​ మేనేజర్  చంద్రశేఖర్  పాల్గొన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న ఐదు జంటలకు ఆర్థికసాయం అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

వంగూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మల్లురవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని పోల్కంపల్లి తెలంగాణ పబ్లిక్  స్కూల్  బిల్డింగ్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో తెలంగాణ పబ్లిక్  స్కూల్స్  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్పంచులు అంకు నారమ్మ, క్యామ మల్లయ్య, లైబ్రరీ చైర్మన్  రాజేందర్, ఏఎంసీ చైర్మన్  అంతటి మల్లేశ్, ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, తహసీల్దార్  మురళీమోహన్  పాల్గొన్నారు.

మైనారిటీల సంక్షేమానికి కృషి

అచ్చంపేట: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ మల్లు రవి తెలిపారు. పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మైనారిటీ కమ్యూనిటీ హాల్  నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను అందజేశారు. ఏఎంసీ  చైర్మన్  రజిత, మున్సిపల్  చైర్మన్  శ్రీనివాసులు పాల్గొన్నారు.

కందనూలు: ప్రతి నెలా తప్పనిసరిగా సివిల్​ రైట్స్​ డే నిర్వహించాలని ఎంపీ మల్లు రవి సూచించారు. కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్  అండ్  మానిటరింగ్  కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ సంగ్రామ్  సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.