
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పలు మలయాళ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు సూరజ్ వెంజరమూడు. తను హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాగేంద్రన్ హనీమూన్స్’. వన్ లైఫ్, ఫైవ్ వైఫ్స్ అనేది ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఇందులో సూరజ్ పాత్ర పేరు నాగేంద్రన్. తను ఉంటున్న పల్లెటూరిని వదిలి విదేశాలకు వెళ్లాలనేది అతని ఏకైక లక్ష్యం. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ ఫ్రెండ్ సలహా ఇస్తాడు. ఆ సలహానే పెళ్లి చేసుకోవడం.
దీంతో ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకుంటాడు. ఐదుగురు భార్యలతో తన హనీమూన్స్ ఎలా జరిగాయి. తన విదేశీ ప్రయాణానికి, ఈ హనీమూన్స్‌కు ఉన్న లింకేంటి అనేది సినిమాలో చూడాలి. శ్వేతా మేనన్, కని కుస్రుతి, గ్రేస్ ఆంటోనీ, అమ్ము అభిరామి, నిరంజన అనూప్ ఐదుగురు భార్యలుగా కనిపించనున్నారు. నితిన్ రెంజీ ఫణిక్కర్ దీనికి దర్శకుడు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.