సంప్రదాయ పూజలు చేసిన ఆదివాసీలు
జైనూర్/ఇంద్రవెల్లి, వెలుగు: ఆదివాసీల అతిపెద్ద జాతరైన కేస్లాపూర్ నాగోబా జాతర గురువారం ప్రారంభమైంది. వారంపాటు జరిగే ఈ జాతరకు మెస్రం వంశీయులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కు పెద్దఎత్తున తరలివచ్చారు. నాగోబా ఆలయంలో గురువారం తెల్లవారుజాము నుంచి సంప్రదాయ పూజలను మెస్రం వంశీయులు ప్రారంభించారు. కాలినడకన వెళ్లి తెచ్చిన గంగా జలాన్ని మందిరానికి చేర్చారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో కేస్లాపూర్ లోని మెస్రం వంశ పూజారి ఇంట్లో ఉన్న నాగదేవతను ఊరేగింపుగా తెచ్చి మందిరంలో ప్రతిష్ఠించారు. అనంతరం సంప్రదాయ రీతిలో గంగా నీళ్లతో నాగదేవతను అభిషేకించి మహా పూజకు సిద్ధం చేశారు. అర్ధరాత్రి మహా పూజ అనంతరం భక్తులకు నాగదేవత దర్శనం స్టార్ట్ చేశారు.
బేటింగ్కు రెడీ
గత రెండ్రోజుల కార్యక్రమాల్లో భాగంగా తుమ్ సమర్పించారు. మెస్రం కుటుంబంలో చనిపోయిన వారి కర్మకాండ సమర్పించడం ప్రత్యేక ఆచారం. ఈ ఆచారం తర్వాతే వారిని దైవాలుగా ఆరాధించడం షురూ చేస్తారు. ఉదయం మెస్రం ఆడపడుచులు కొత్తకుండలతో నీళ్లు తరలించి మట్టితో ప్రతిమలు తయారు చేశారు. వంశంలో కొత్త కోడళ్ల బేటింగ్కోసం ఏర్పాట్లు చేశారు. మహా పూజ అందుకున్న దేవుని దగ్గర మట్టి ప్రతిమలతో కోడళ్లను బేటింగ్ చేస్తారు. ఆపై వారిని ఇంటి ఆడపడుచులుగా లెక్కలోకి తీసుకుంటారు.
