‘నాగోల్ చిన్నారులు’ ఇంకా దొరకలే!..ఉప్పల్ భగాయత్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తింపు

‘నాగోల్ చిన్నారులు’ ఇంకా దొరకలే!..ఉప్పల్ భగాయత్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తింపు
  •     మూడు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్​  

ఎల్బీనగర్, వెలుగు: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అన్నదమ్ములు ఆచూకీ ఇంకా దొరకలేదు. సాయిరాం నగర్ కాలనీకి చెందిన వరుణ్ తేజ్(8), మహేష్ (6) ఇంటి నుంచి బండ్లగూడ చెరువువైపు వెళ్లగా అప్పటి నుంచి పోలీసులు వెతుకుతున్నారు. అయినా, దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొదటి రోజు నాగోల్​ బండ్లగూడ చెరువు వైపు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు హైడ్రా సిబ్బందితో కలిసి చెరువులో బోటుతో వెతికారు. అలాగే, చుట్టుపక్కల ఉన్నారేమోనని డ్రోన్ల సాయం కూడా తీసుకున్నారు. 

అయినా, ఎక్కడా కనపడలేదు. దీంతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఉప్పల్ భగాయత్​లోని ఓ టీ పాయింట్​ వద్ద సీసీ కెమెరాను చూడగా అందులో ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తడం గమనించారు. దీంతో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ వైపు దృష్టి సారించారు. పిల్లల ఆచూకీ కనుక్కోవడానికి పోలీసులు ఇప్పటివరకు 250 సీసీ కెమెరాలను పరిశీలించారు.