ప్రశ్నించిండనే పక్కన బెట్టిన్రు

ప్రశ్నించిండనే పక్కన బెట్టిన్రు

కార్మిక, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిది మొదటి నుంచి ధిక్కార స్వరమే. ఆయనది దేనికి రాజీపడే స్వభావం కాదు. జీవితాంతం కార్మికుల పక్షాన నిజాయితీగా నిలబడ్డారు. కార్మికుల హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతి సందర్భంలోనూ గొంతు విప్పారు. ప్రభుత్వాన్ని ధిక్కరించినందుకు అనేకసార్లు అరెస్టయ్యారు. ఎమర్జెన్సీలోనూ జైలుకెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలోని నేరెడుగొమ్ము గ్రామంలో సాధారణ రైతు నాయిని దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు 1944 మే 12న నర్సింహారెడ్డి పుట్టారు. తన గ్రామంలో అశాంతి నెలకొనడంతో బాల్యంలోనే హైదరాబాద్ కు వలస వచ్చారు. అభ్యుదయ భావాలతో పెరిగినందున సోషలిస్ట్ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా రాజకీయ అరంగేట్రం చేశారు. హింద్ మజ్దూర్ సభ(హెచ్ఎంఎస్) అనుబంధ కార్మిక సంఘాల్లోనూ పనిచేశారు. 1969 నాటి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. 1970లో ‘వజీర్ సుల్తాన్ టొబాకో(వీఎస్టీ) కార్మిక సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఏర్పాటైన జనతా పార్టీలో చేరారు. ముషీరాబాద్  నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ఏర్పడిన తొలినాళ్లలోనే ఆ పార్టీలో చేరి మలి దశ ఉద్యమంలో కేసీఆర్​కు అండగా నిలిచారు.

తప్పు జరిగితే నిలదీస్తరు

నాయిని తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేస్తుండగా అప్పటి పోలీసులు చంపేశారు. ఇది ఆయన మనసులో బాగా నాటుకుపోయింది. అందుకే హింసను నాటితే కోతకు వచ్చేది కూడా హింసే అవుతుందని నమ్మేవారు. అందుకే మావోయిస్టులతో మాట్లాడేటప్పుడు వాళ్ల హింసను ఖండించేవారు. పోలీసుల హింసనూ ఖండించేవారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలపై కాల్పులు జరిగితే జార్జి ఫెర్నాండెజ్​ తో కలిసి వెళ్లారు. పౌర హక్కుల సంస్థలు చేపట్టే ధర్నాల్లో పాల్గొనేవారు. ఇదే పద్ధతిలో కేసీఆర్​ చేసే తప్పులను ప్రశ్నించారు. ‘తెలంగాణ వద్దన్న ఆంధ్ర కాంట్రాక్టర్లను, ఆంధ్ర మంత్రులను ఎందుకు గౌరవిస్తున్నావు. తెలంగాణ వద్దన్న వాళ్లను మంత్రులుగా ఎందుకు చేస్తున్నవు’ అని కేసీఆర్​ను అడిగినందుకే 2018లో కేసీఆర్​ నర్సన్నను  పక్కనబెట్టారు

పోలీస్​ శాఖను సంస్కరించలేకపోయిండు

నాయిని జీవితమంతా పోలీసులు, కేసులతోనే బాధపడ్డారు. అందుకే హోం శాఖతోపాటు లా అండ్​ ఆర్డర్​ కూడా కావాలని కోరుకున్నారు. పోలీసు శాఖకు పునాదిగా మానవత్వం ఉండాలని భావించి ఈ శాఖలో సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. జైళ్లలోనూ సంస్కరణలు అమలు చేయాలనుకున్నారు. సైనిక్​ వెల్ఫేర్, లేబర్​ వెల్ఫేర్​ శాఖలు కూడా తీసుకున్నారు. జైళ్లను సంస్కరించి ఉంటే.. పోలీస్ శాఖను సంస్కరించి ఉంటే, లేబర్​ డిపార్ట్​మెంట్​ పై పూర్తి అధికారం ఇచ్చి ఉంటే ఆయన సంతోషించేవారు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారాలన్నీ సీఎం దగ్గరే ఉండటంతో ఆరో వేలిగా ఉన్నానని నాయిని బాధపడేవారు.

ఇచ్చిన మాట కోసం పట్టుబట్టిన్రు

కేసీఆర్​ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నాయిని ప్రశ్నించిండమే కాక పబ్లిక్​ గా ప్రకటనలు చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంలో ‘కార్మిక సంఘాలను రద్దు చేయాలె. కార్మిక సంఘాలు ఉండొద్దు. ఇవి అభివృద్ధికి వ్యతిరేకం’ అని సీఎం కేసీఆర్​ అంటే దానిని నర్సన్న ఖండించారు. దీనిపై పోరాటం చేస్తా.. ఇంత నీచమా అన్నారు. ఆయన అసంఘటిత రంగానికి పెద్ద పీట వేయాలని కోరుకున్నారు. కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యమాలను అణచివేయడం, సింగరేణి లో ఉద్యోగాలు తగ్గించడం, ఓపెన్​ కాస్టులు పెంచడంపై బాధపడ్డారు. ఆల్విన్, ఐడీపీఎల్, అజాంజాహి మిల్లు, డీబీఆర్​ మిల్లు, సర్​ సిల్స్​ మిల్లు, నిజాం షుగర్స్ తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పటి సీఎం చంద్రబాబు మూసివేయడంపై కార్మిక నేతగా ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చాక వీటన్నింటిని తెరుస్తమని ఉద్యమంలో మాట ఇచ్చినమని, వాటిని తెరవాలని కేసీఆర్ ను కోరారు. వాటిని తెరిచేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏ ప్రయత్నమూ జరగలేదు.

ప్రభుత్వం పట్టించుకోలేదనే స్ర్టెస్​ ఫీలైండు

నర్సన్న ఇంటి దగ్గర పెద్ద దర్బార్​ ఉండేది. ఆయన దగ్గరికి చాలా మంది కార్మికులు, పేదలు వివిధ పనులపై వచ్చేవారు. అధికార పార్టీలో ఉండి కూడా ఆయన ఒక్క సమస్యనూ పరిష్కరించలేక పోయారు. వైఎస్​ హయాంలో 2004 నుంచి 2006 వరకు టెక్నికల్​ ఎడ్యుకేషన్​ మినిస్టర్​ గా ఉండి చేసిన పనులను కూడా ఇప్పుడు చేయలేకపోయానని బాధపడ్డారు. లోహియా సిద్ధాంతాలను నర్సన్న చెబితే సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు విన్నారు.. అమలు చేశారు. కానీ సీఎం కేసీఆర్​కు చెబితే ఎన్నడూ వినడానికి ప్రయత్నం చేయలేదు. అమలు చేయడానికి అసలే ప్రయత్నం చేయలేదు. తాను చెప్పినవేవి ప్రభుత్వం పట్టించుకోలేదని మనస్తాపం చెందారు. ఆయనకు షుగర్​ వ్యాధి ఉన్నప్పటికీ.. ఈ స్ట్రెస్​ వల్ల షుగర్​ లెవల్స్​ మరింత పెరిగాయి. నాయిని ముక్కు సూటిగా మాట్లాడతారు. మాటల్లో నిబద్ధత ఉంటుంది. అందరితో కలివిడిగా ఉంటారు. సాధారణ జీవనాన్నే ఇష్టపడతారు. అలసి పోకుండా కార్మిక సంఘంలో, రాజకీయంలో ముందుకు పోయేవారు. నిజాయితీ, అసలే దురలవాట్లు లేకపోవడమే నాయిని జీవన విధాన ఆభరణాలు. ఆయన జీవితం, ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం.-పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు