నకిరేకల్లో చిరుమర్తి వర్సెస్ వేముల.. ప్రజలకు ప్రతిరోజూ పండగే

 నకిరేకల్లో చిరుమర్తి వర్సెస్ వేముల.. ప్రజలకు ప్రతిరోజూ పండగే

పండగొస్తేనే దావత్..ఎన్నికలు వస్తేనే అసలైన పండగ. ఎప్పుడూ రాని లీడర్లు వస్తుంటారు..ఎప్పుడు లేని ప్రేమలు చూపిస్తుంటారు. ఎప్పుడు జరగని పండగలు కూడా జరుగుతుంటాయి. పెండ్లి అయినా..సావు అయినా ఘనంగా చేసుకోవచ్చు. నకిరేకల్ లో ఒకే పార్టీలో ఇద్దరు లీడర్ల పంతం..ఆ ప్రాంతంలో ప్రతీ రోజును పండగగా మార్చేసింది. 

బైపోల్ వస్తేనే కనిపించే పండుగ నల్గొండ జిల్లా నకిరేకల్ సెగ్మెంట్లో ముందే వచ్చింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఆధిపత్య పోరు ఊరూరా సందడి తెచ్చింది. బలం చాటుకోవడానికి జనం ఇంటి వేడుకలను కూడా పోటాపోటీగా ఇద్దరు లీడర్లు నిర్వహిస్తుండడం గురించి లోకల్ గా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. గతంలో దాడులు, గొడవలు జరిగినా ఎలక్షన్ దగ్గరికొచ్చిన టైంలో రెండు వర్గాలు పండుగలు, వేడుకలతో పోటీపడుతున్నాయి. 
 

తాజాగా నకిరేకల్ లో వేముల వీరేశం బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద పండుగే చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదే టైంలో పోటీగా చిరుమర్తి పలు కార్యక్రమాలు చేశారు. ఇద్దరు లీడర్ల పోటీపోటీ కార్యక్రమాలతో నకిరేకల్ పాలిటిక్స్ వేడెక్కాయి. ఊర్లలో చావులు, పెళ్లిల్లు, పుట్టినరోజు లాంటి వేడుకల్లోనూ ఇద్దరి వర్గాలు పోటాపోటీగా హల్చల్ చేస్తున్నాయి.

చిరుమర్తి కాంగ్రెస్‍ నుంచి బీఆర్ఎస్ లో చేరాక వీరేశం కొంత సైలెంట్ అయ్యారు. కొంతకాలంగా పలు కార్యక్రమాలతో స్పీడ్ పెంచారు. లోకల్ బాడీ ఎన్నికల్లో MLA వర్గానికి చెక్ పెట్టడంతో కలకలం రేగింది. పోటాపోటీ కార్యక్రమాల్లో పలుమార్లు ఇద్దరి వర్గాలు గొడవలు పడ్డాయి. ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో ఎవరికివారు సొంతగా ఉన్న సపోర్ట్ తో బలప్రదర్శనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాత నేతలు, కార్యకర్తలు వీరేశంకు సపోర్ట్ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వర్గం లింగయ్యతో ఉంది. 

పార్టీ హైకమాండ్ సిట్టింగ్ లకే టికెట్ అని చెబుతుంటే.. తనకున్న మద్దతుతో టికెట్ నాకే అని వీరేశం వర్గం చెబుతోంది. టికెట్ రాకుంటే ప్లాన్ బీ కూడా ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే హైకమాండ్ సపోర్ట్ లింగయ్యకేనని ఆయన అనుచరులు చెబుతున్నారు.