నల్గొండ జిల్లాలో యూరియాకు కొరత లేదు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలో యూరియాకు కొరత లేదు :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  •     నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్‌లో  యూరియా పంపిణీ పై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో యూరియా పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. 

ఈ రబీ సీజన్‌లో నల్గొండ జిల్లాకు 74,955 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు రైతులు 35378  మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని తెలిపారు. మండలాల్లో ప్రస్తుతం 2730.9  మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో  10,527 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్  కూడా అందుబాటులో ఉందన్నారు.  

మొత్తం 13936  మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియాకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800425142  కు లేదా రాష్ట్రస్థాయిలోని హెల్ప్ లైన్ నెంబర్ 1800 5995779 ను సంప్రదించవచ్చని సూచించారు.  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా మార్కెటింగ్  అధికారి ఛాయాదేవి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా ఉద్యానశాఖ డీడీ కే. సుభాషిని తదితరులు హాజరయ్యారు.

సాగుకు సరిపడా యూరియా నిల్వలు– యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి, వెలుగు: యాసంగి సీజన్​లో సాగు చేసే పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్​హనుమంతరావు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీసీ నిర్వహించిన​ అనంతరం జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్  మాట్లాడారు. రైతులకు అవసరమైన యూరియాను అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.  ఇప్పటికే 15,611 టన్నుల యూరియాను రైతులకు అందించామని తెలిపారు.  

మరో 6191 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. సాగుకు అవసరమైన స్థాయిలోనే యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించారు. ప్రతిరోజు ఆరు గంటలకే యూరియా అమ్మకాలు చేపట్టాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా.. ఎక్కువ రేట్లకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.