- ఈ నెల 15 వరకు ఎన్నిక నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. నామినేషన్ల ప్రక్రియ మాత్రమే చేపట్టాలని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక మాత్రం నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఇందుగుల గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన రాంప్రసాద్ త్రిపురారం మండలం చౌళ్లతండాకు చెందిన చింతమళ్ల కల్పన అలియాస్ ధరావత్ కల్పనను రెండు నెలల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు.
తర్వాత కల్పన తన ఓటును చౌళ్ల తండా నుంచి ఇందుగులకు మార్చుకుంది. కానీ ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో కల్పన పేరు లేకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కల్పన పేరును మాడ్గులపల్లి మండల ఓటర్ల జాబితాలో చేర్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
తర్వాత కల్పన సర్పంచ్ క్యాండిడేట్‌గా నామినేషన్ వేసింది. అయితే ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో కల్పన మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిన కోర్టు.. అప్పటివరకు ఎన్నికలను నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నామినేషన్లు వేసిన క్యాండిడేట్లు ఆందోళనలో పడిపోయారు.
