నల్గొండ: ఆగస్టు నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం

నల్గొండ: ఆగస్టు నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం
  •      మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు:  ఆగస్టు నాటికి నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి, వాటిని మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా తాను విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు. 

ఈ ఏడాది పదో తరగతిలో 95 శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన ప్రతీక్ పాఠశాల విద్యార్థులను తన సొంత నిధులతో ఢిల్లీకి విమానంలో పంపిస్తానని, విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. నెల రోజుల్లో ఈ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ఏఐ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హరే రామ హరే కృష్ణ వారి సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 30 నుంచి 40 పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి తాగునీరు, టాయిలెట్లు, డ్యూయల్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు, కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

యూరియా కొరత లేకుండా చర్యలు 

రైతులు పంటలు సాగు చేసుకునేందుకు వానకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నల్లగొండలోని ఇందిరా భవన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ను ప్రారంభించారు.  ఎకరాకు 2 బస్తాల చొప్పున, ఐదెకరాల పైబడిన వారికి విడతల వారీగా యూరియా సరఫరా చేస్తామన్నారు. అనంతరం విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లో-వోల్టేజీ సమస్యలు రాకుండా చూడాలని, విరిగిన స్తంభాలను సరిచేసి, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ టీషర్టులను మంత్రి ఆవిష్కరించారు.

త్వరలో సీఎం పర్యటన 

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్ల పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే నల్లగొండ జిల్లాకు రానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో రూ.13,500 కోట్లతో చేపట్టనున్న ఈ రోడ్ల శంకుస్థాపన పైలాన్ పనులను ఆయన శనివారం పరిశీలించారు.  పైలాన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్మించాలని సూచించారు. అనంతరం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.