నల్గొండ జిల్లా జైలులో కలకలం..పురుగు మందు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా జైలులో కలకలం..పురుగు మందు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం

అపస్మారక స్థితిలో హాస్పిటల్​కు తరలింపు
జైలులోకి పురుగు మందు ఎలా వచ్చిందన్న అనుమానాలు 

నల్గొండ, వెలుగు: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే జిల్లా జైలులో ఓ ఖైదీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. నల్గొండ జిల్లా జైలులో ఈ ఘటన జరిగింది. మోత్కూరులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడైన బాబూరావుకు కోర్టు శిక్ష విధించింది. నల్గొండ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తుండగా, మంగళవారం బాబూరావు పురుగు మందు తాగి బ్యారక్‌‌‌‌‌‌‌‌లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

వెంటనే జైలు అధికారులు బాబూరావును నల్గొండ ప్రభుత్వ జనరల్  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సకాలంలో హాస్పిటల్​కు తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. బాబూరావు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే కోణంలో పోలీసులు, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇదిలాఉంటే జైలులోకి పురుగు మందు ఎవరు తెచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఘటనపై జైలు అధికారులు వివరాలు వెల్లడించకుండా మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.