
- దంపతుల పంచాయితీ విషయమై ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగిన వైనం
- నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం పీఎస్ లో ఘటన
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : దంపతుల పంచాయితీలో భాగంగా ఇరువర్గాలు కొట్టుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఎస్ఐ జగన్ తెలిపిన ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండాకు చెందిన కరెంటోతు జ్యోతి భర్త నరేశ్ తాగొచ్చి ఇంట్లో గొడవపడుతుంటాడు. మంగళవారం రాత్రి తాగొచ్చి భార్యను నరేశ్ కొట్టాడు. దీంతో అదే తండాలో ఉండే ఆమె తల్లిదండ్రులు వచ్చి అల్లుడిని, అతని కుటుంబసభ్యులను మందలించారు.
ఆపై జ్యోతి సంస్థాన్ నారాయణపురం పోలీసులకు భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దమనుషుల్లో మాట్లాడుకోవాలని దంపతులకు పోలీసులు సూచించారు. శుక్రవారం ఇరువర్గాల పెద్ద మనుషులు పోలీసుస్టేషన్ ఆవరణలోనే పంచాయితీ నిర్వహించారు. మధ్యలో మాటా మాటా పెరిగి ఇరువర్గాలు స్టేషన్ ఆవరణలోనే కొట్టుకుంటుండగా.. పోలీసులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్థానిక గ్రూపుల్లో వైరల్ అయి విషయం బయటకు తెలిసింది.