నల్గొండలో దారుణం: ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ప్రియుడి కోసం బస్టాండ్లో కొడుకును వదిలేసిన మహిళ

నల్గొండలో దారుణం: ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ప్రియుడి కోసం బస్టాండ్లో కొడుకును వదిలేసిన మహిళ

నల్గొండ అర్బన్‌‌, వెలుగు: ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పరిచయమైన యువకుడితో వెళ్లేందుకు ఓ మహిళ తన ఐదేండ్ల కొడుకును బస్టాండ్‌‌లోనే వదిలేసింది. ఈ ఘటన నల్గొండ పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌‌కు చెందిన ఓ మహిళకు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో నల్గొండకు చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వీరు తరచూ చాటింగ్‌‌ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మహిళ తన ఐదేండ్ల కొడుకును వెంటబెట్టుకొని ఆదివారం నల్గొండకు వచ్చింది. బస్టాండ్‌‌లో దిగిన వెంటనే సదరు యువకుడికి ఫోన్‌‌ చేయగా.. అతడు కూడా బస్టాండ్‌‌కు వచ్చాడు. 

తర్వాత ఆ మహిళ తన కొడుకును బస్టాండ్‌‌లోని ఓ బెంచీ మీద కూర్చోబెట్టి యువకుడితో వెళ్లిపోయింది. ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు టూటౌన్‌‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు బస్టాండ్‌‌కు వచ్చి చిన్నారితో మాట్లాడారు. అనంతరం బస్టాండ్‌‌తో పాటు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి మహిళ ఆచూకీని కనుగొన్నారు. మహిళను తీసుకెళ్లిన యువకుడిని అదుపులోకి తీసుకొని, మహిళ భర్తకు సమాచారం ఇచ్చి బిడ్డను అప్పగించారు. అనంతరం మహిళకు కౌన్సిలింగ్‌‌ ఇచ్చి పంపించారు.