జవాన్ల ఫ్యామిలీలకు ఉచిత న్యాయ సాయం : కేంద్రం

జవాన్ల ఫ్యామిలీలకు ఉచిత న్యాయ సాయం : కేంద్రం
  • ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యల పరిష్కారంకోసం కొత్త పథకం

శ్రీనగర్: ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందించే లక్ష్యంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా).. ‘వీర్ పరివార్ సహాయత యోజన 2025’ను ప్రారంభించింది. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా  శనివారం శ్రీనగర్‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్, కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ‘వీర్ పరివార్ సహాయత యోజన’ ను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ..“మీరు(జవాన్లు) సరిహద్దులో దేశ సేవ చేయండి. మేం మీ కుటుంబాల్ని జాగ్రత్తగా చూసుకుంటాం” అనేదే సహాయత  యోజన ప్రధాన నినాదమన్నారు.

 ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికుల త్యాగాల నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించినట్లు చెప్పారు. సైనికులు డ్యూటీలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు న్యాయపరమైన సమస్యలతో ఇబ్బంది పడకుండా చూడాలనే తమ లక్ష్యమన్నారు. సహాయత యోజన ద్వారా సైనికులు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి పారామిలిటరీ బలగాల కుటుంబాలకు ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, భూమి హక్కులు వంటి సమస్యల్లో సకాలంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా సైనిక్ వెల్ఫేర్ బోర్డుల్లో న్యాయ సేవా క్లినిక్‌‌‌‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందులో ప్యానెల్ లాయర్లు, పారా-లీగల్ వాలంటీర్లు సేవలు అందిస్తారని వివరించారు.