ప్లాస్టిక్ బాటిల్స్‌‌తో ఇండ్లు

ప్లాస్టిక్ బాటిల్స్‌‌తో ఇండ్లు

నమిత కపాలె, కళ్యాణి భరంబె ఇద్దరూ ఫ్రెండ్స్‌‌. వాడి పడేసిన పదహారు వేల ప్లాస్టిక్ బాటిల్స్‌‌ను చెత్తలో నుంచి ఏరుకొచ్చారు. ఎకో బ్రిక్స్‌‌ కాన్సెప్ట్‌‌తో మట్టి, పేడ కలిపి ప్లాస్టిక్ బాటిల్స్‌‌తో ఇళ్లు కట్టారు. ఆ ఇళ్లని హోటల్స్‌‌, రెస్టారెంట్స్‌‌గా వాడితే బాగుంటుందని చెప్తున్నారు.

ఔరంగాబాద్‌‌కు చెందిన నమిత, కళ్యాణి గవర్నమెంట్‌‌ డిగ్రీ కాలేజీలో ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ చదువుతున్నారు. ప్లాస్టిక్‌‌ బాటిల్స్‌‌తో కట్టిన ఇళ్ల వీడియో ఒకటి లాక్‌‌డౌన్‌‌ టైంలో వైరల్‌‌ అయింది. ఆ వీడియో చూసిన వీళ్లకు ప్లాస్టిక్ బాటిల్స్‌‌తో ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చింది. ఇంటర్నెట్​ ద్వారా ‘ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని బాటిల్స్‌‌ కావాలి? ఎలా కట్టాలి? ఇంకా ఏ వస్తువులు ఉపయోగపడతాయ’న్న విషయాలు తెలుసుకున్నారు. అయితే, ఈ ఇల్లు కట్టడానికి వేస్ట్‌‌గా పడేసిన వాటినే వాడాలి అనుకున్నారు. అప్పటినుంచి ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే చేతిలో ఒక సంచితో బయటికి వచ్చేవాళ్లు. చెత్త కుప్పలు, డంప్‌‌యార్డ్స్‌‌, హోటల్స్, పార్క్‌‌లు... ఇలా అన్ని చోట్లకూ వెళ్లేవాళ్లు. కనిపించిన బాటిల్స్‌‌, మూతల్ని ఏరేవాళ్లు. అలా మొత్తం పదహారువేల ప్లాస్టిక్‌‌ బాటిల్స్‌‌ని చెత్తనుంచి సేకరించారు.

కొత్త పద్ధతిలో...

ఆ బాటిల్స్‌‌ని తీసుకొని వీడియోల్లో చూపించినట్టు ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. కానీ, కొంచెం పేర్చగానే ఆ గోడలు కూలిపోయేవి. ఎందుకు అలా జరుగుతుంది అనేది తెలుసుకున్నారు.  ఇక్కడి వాతావరణ పరిస్థితిని తట్టుకునేలా గోడలు కట్టాలనుకున్నారు. అందుకు పాతకాలంనాటి మట్టిగోడల పద్ధతి బెటర్‌‌‌‌ అనుకున్నారు. దానికోసం ముందు మామూలు గోడలకు వేసే పునాది వేశారు. బాటిల్స్‌‌లో మట్టి నింపి ఇటుకల్లా వాడారు. మట్టి, పేడను బాగా కలిపి సిమెంట్‌‌లా ఉపయోగించారు. పై కప్పును వెదురు బొంగులు, తాటాకులు, ఎండు గడ్డితో చేశారు. వాటిని మట్టితో కప్పారు. ఇంటి గోడలు లేపి,  ఇల్లు కట్టేశారు. ఈ ఇల్లు వర్షానికి, గాలికి, వేడికి, చల్లదనానికి తట్టుకుంటుంది. ఆ ఇల్లు లాంటివే మరో మూడు ఇండ్లు అక్కడే కట్టారు. వీళ్లు చేస్తున్న పని నచ్చి వాళ్ల దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్‌‌ని తీసుకొచ్చి వీళ్లకి ఇస్తున్నారు అక్కడి వాళ్లు. ప్లాస్టిక్ బాటిల్స్‌‌తోనే కూర్చోవడానికి టేబుల్స్‌‌, మెట్లు, మొక్కలకు ఫెన్సింగ్‌‌ ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఈ ఇండ్లలోనే హోటల్‌‌ తెరిచే ఆలోచనలో ఉన్నారట ఈ ఇద్దరు. వీటితో హోటల్స్‌‌ కడితే కొత్త లుక్‌‌లో బాగుంటాయి. వాటికి రంగులు, లైటింగ్‌‌ పెడితే చాలా అట్రాక్టివ్‌‌గా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ఇలాంటివి కట్టిస్తామని చెప్తున్నారు నమిత, కళ్యాణి.

‘ప్లాస్టిక్‌‌ను చెత్త నుంచి వేరు చేసి, రీ సైకిలింగ్‌‌కి పంపేవాళ్లు చాలా తక్కువ మంది. వాటిని కాల్చడం వల్ల కాలుష్యమే ఎక్కువ. అలాగే పడేయడం వల్ల భూమి, నీళ్లల్లో పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రయత్నం చేశాం. ఎవరికి వాళ్లు ప్లాస్టిక్‌‌ వాడటం వల్ల కలిగే నష్టాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండటమే అన్నింటికీ పరిష్కారం’ అంటున్నారు నమిత, కళ్యాణి.