రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నందకుమార్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించింది. దీంతో నందకుమార్ ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 

అంతకుముందు.. మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ ఇవాళ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అలా విడుదల అయ్యారో లేదో జైలు బయటే ఇద్దరిని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదైన ఫిర్యాదుల ఆధారంగా వారిద్దరిని మ‌ళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

న‌కిలీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామ‌చంద్ర భార‌తిని, చీటింగ్ కేసులో నంద‌కుమార్‌ను హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి షౌక‌త్ న‌గ‌ర్ ప్రభుత్వాసుప‌త్రిలో వైద్య ప‌రీక్షలు నిర్వహించారు. అనంత‌రం ఇద్దరు నిందితుల‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. నందకుమార్ బెయిల్ పై సోమవారం వాదనలు జరగనున్నాయి.