
- ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారంట్ ఉన్నందున అరెస్టు చేసి తీసుకురావాలని సూచించింది.
ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.