మీనాక్షిపై పిటిషన్ను స్వీకరించలేమన్న నాంపల్లి కోర్టు

మీనాక్షిపై పిటిషన్ను స్వీకరించలేమన్న నాంపల్లి కోర్టు
  • ప్రజాప్రతినిధులపై విచారణ తమ పరిధిలోకి రాదని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌‌ కేసు కీలక మలు పు తిరిగింది. ఆమెకు సంబంధించిన కేసు ఫిర్యాదులో ప్రతివాదులుగా ప్రజాప్రతినిధులు ఉన్నందున విచారణ తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్‌‌ మెజిస్ట్రేట్‌‌ కోర్టు జడ్జి అలకుంట్ల స్వర్ణలత శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతివాదుల్లో నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నందున పిటిషన్​ను ఫిర్యాదుదారు, తార్నాక మాజీ కార్పొరేటర్  శ్రీలతకు రిటర్న్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

విధివిధానాలకు తగ్గట్టుగా సంబంధిత కోర్టులో పిటి షన్‌‌ దాఖలు చేసుకోవచ్చని సూచించారు. నారాయణ పేట కాంగ్రెస్‌‌ నాయకుడు కుంభం శివకుమార్‌‌ రెడ్డి తనను లైంగికంగా వేధించాడని, చంపుతానని బెది రించాడని మాజీ కార్పొరేటర్‌‌‌‌ శ్రీలత గత ఏడాది ఆగస్టు 28న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్‌‌ మెజిస్ట్రేట్‌‌ కోర్టులో ప్రైవేట్‌‌ కంప్లైంట్‌‌ దాఖ లు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నాంపల్లి కోర్టులో దాఖలైన ప్రైవేట్ కంప్లైంట్‌‌కు సంబంధించిన వివరాలను మధ్యప్రదేశ్‌‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌‌ అఫిడవిట్‌‌లో మీనాక్షి నటరాజన్‌‌ వెల్లడించలేదని ఆమె నామినేషన్‌‌ను తిరస్కరించారు.

ఈ వివాదానికి కేంద్ర బిందువైన శ్రీలత ప్రైవేట్‌‌ కంప్లైంట్‌‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సహా పలువురు అడ్వకేట్లు ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు. ప్రతివాదుల్లో నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నందున జ్యూరిస్డిక్షన్‌‌ పరిధి కాదని తెలిపారు. ఈ క్రమంలోనే కంప్లైంట్‌‌ను విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఇందుకు గల కారణాలను వివరిస్తూ పిటిషన్​ను రిటర్న్‌‌ చేసింది.

ప్రతివాదుల్లో నలుగురు ప్రజాప్రతినిధులు కావడం వల్లే.. 

శ్రీలత దాఖలు చేసిన ఫిర్యాదులో మొదటి ప్రతివాది నారాయణపేట కాంగ్రెస్‌‌ నాయకుడు కుంభం శివకుమార్‌‌రెడ్డి కాగా, ఆ తర్వాత వరుసగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌, మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌చార్జ్​మీనాక్షి నటరాజ్‌‌, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్‌‌రెడ్డి, పీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌‌రెడ్డిపై శ్రీలత అభియోగాలు మోపారు.

తనను వేధించిన శివకుమార్‌‌రెడ్డిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీలత ఆరోపించారు. తనకు పరువు నష్టం జరిగిందని పేర్కొన్నారు. బాధ్యులైన ప్రతివాదులపై చర్యలు తీసుకుని తనకు రూ.10 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు.