
ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ ప్రేక్షకులకు సుపరిచితమే. తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు సామాజిక సేవలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు నానా పటేకర్ మరోసారి తన మంచు మనసు చాటుకున్నారు. సోమవారం (2025 సెప్టెంబర్ 22న) జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రాజౌరి మరియు పూంచ్ సరిహద్దు జిల్లాలను పర్యటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ షెల్లింగ్ బాధితులతో మాట్లాడి ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలో బాధిత కుటుంబాల కష్టాలను తెలుసుకుని చలించిపోయిన పటేకర్, వారిని పరామర్శిస్తూ.. తన వంతు సాయంగా ముందుకొచ్చారు. భారత సైన్యంతో చేతులు కలిపి, తన ఎన్జీఓ, నిర్మలా గజానన్ ఫౌండేషన్ (NGF) కింద 48 ఆర్మీ పాఠశాలలను దత్తత తీసుకున్నాడు. అలాగే, పాక్ షెల్లింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన 117 బాధిత కుటుంబాలకు రూ.42 లక్షల విలువైన సహాయాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సహాయం చేయడం మన వంతు బాధ్యత అని నానా పటేకర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సహాయం చేయడం మన బాధ్యత. ఈ భాధిత కుటుంబాలకు ఇది ఒక చిన్న విరాళం. దీని ద్వారా, వారు ఒంటరి కాదని మా సంస్థ ద్వారా వారికి చెప్పాలనుకుంటున్నాము. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా, పౌరులుగా ముందుకు వచ్చి కనీసం ఒక కుటుంబాన్నైనా దత్తత తీసుకోవడం గొప్ప సహకారం అవుతుంది” అని నానా పటేకర్ కోరారు.
ఈ కార్యక్రమంలో పటేకర్ వెంట సీనియర్ ఆర్మీ మరియు సివిల్ అధికారులు ఉన్నారు. వీరిలో 25వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కౌశిక్ ముఖర్జీ మరియు డిప్యూటీ కమిషనర్ రాజౌరి అభిషేక్ శర్మ ఉన్నారు. బాధిత సరిహద్దు నివాసితులకు సాయం చేయడానికి ముందుకొచ్చిన పటేకర్ NGF చొరవను అధికారులు ప్రశంసించారు.
ఈ ఏడాది 2025 ఏప్రిల్ 22న విధ్వంసకర పహల్గామ్ ఉగ్రదాడి ఎంతటి మారణహోమం స్పృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది భారత్ సైన్యం. ఇందులో భాగంగా పాకిస్తాన్ కాల్పుల బారిన పూంచ్ మరియు రాజౌరి జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.
ALSO READ : తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో ‘మా వందే’
ఈ క్రమంలో బాధితుల కష్టాలను తెలుసుకుని చలించిపోయిన పటేకర్, వారిని పరామర్శిస్తూ.. తన వంతు సాయంగా ముందుకొచ్చారు. ఇలా 48 ఆర్మీ పాఠశాలలు, 117 బాధిత కుటుంబాలతో పాటుగా, పూంచ్‌లో సరిహద్దు కాల్పుల సమయంలో తన తండ్రి అమ్రీక్ సింగ్‌ను కోల్పోయిన 11 ఏళ్ల బాలిక విద్యకు తాను వ్యక్తిగతంగా సహాయం చేస్తానని ప్రకటించాడు. పటేకర్ చాటిన మంచి మనసుకి నెటిజన్లు ప్రశంసలు అందిస్తూ.. మిగతా నటులు కూడా ముందుకు రావాలని ట్వీట్స్ పెడుతున్నారు.
పటేకర్, తన విలక్షణమైన నటనకుగానూ వరుసగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు మరాఠీలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. సినిమా మరియు కళలలో ఆయన చేసిన కృషికి 2013లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు పటేకర్.