యూట్యూబర్​: తినడమే ఆమె పని

యూట్యూబర్​: తినడమే ఆమె పని

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటుంటారు పెద్దలు. కానీ నవోమీ కూర్చుని తింటే ఆస్తులు కరగడం కాదు.. పెరుగుతున్నాయి. మనందరికీ బాగా తింటే ఖర్చు పెరుగుతుందనే తెలుసు. కానీ.. ఈ అమ్మాయి రంగురంగుల ఫుడ్‌ తింటూ కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. ఫుడ్‌ తింటున్నప్పుడు వచ్చే సౌండ్స్‌తోపాటు, ఫుడ్‌ని ఫీలవుతున్న ఎక్స్‌ప్రెషన్స్‌ రికార్డ్ చేసి ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటుంది. వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

కెమెరా ముందు బ్రైట్‌ కలర్స్ ఉండే జంక్‌ ఫుడ్‌ తింటూ లక్షల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది నవోమీ మెక్‌రే. కెనడాలోని అంటారియోకు చెందిన నవోమీ వయసు 27 ఏండ్లు. ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టకముందు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో పనిచేసేది. ముఖ్యంగా బాడీ బిల్డింగ్, బికినీ పోటీల్లో కూడా చాలాసార్లు పార్టిసిపేట్‌ చేసింది. ఎప్పుడూ ఫిట్‌గా ఉండేది. పైగా ప్రజలు ఫిట్‌గా ఉండేందుకు డైట్‌ ప్లాన్స్‌ కూడా తయారుచేసేది. చాలామందికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌‌గా పనిచేసింది. కానీ.. అనుకోకుండా ఒక రోజు ఫిట్‌నెస్‌ కెరీర్‌‌ని వదులుకుని యూట్యూబర్‌‌ అవతారమెత్తింది. కారణం ఏంటంటే.. 

ఏఎస్‌ఎంఆర్‌‌

నవోమీకి 16 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఏఎస్‌ఎంఆర్‌‌(అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్) వీడియోలు చూసింది. ఈ వీడియోల్లో వచ్చే సౌండ్స్‌ వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ఒక ధ్యానం లాంటిదని కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఈ సౌండ్స్‌ విన్నవాళ్లలో చాలామందికి తల మీద, మెడపై ఒక రకమైన జలదరింపు వస్తుంది. కొందరికి భుజాలపై కూడా వస్తుంది. ఇలాంటి ఏస్‌ఎంఆర్‌‌ వీడియోలను ఒక యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌‌ ‘జెంటిల్ విస్పరింగ్’ ఛానెల్‌లో పోస్ట్‌ చేసేది. 

వీడియోల్లో రకరకాల సౌండ్స్‌ చేస్తుండేది. ఆ వీడియోల్లో వాళ్లు ఏది మాట్లాడినా గుసగుసలాడినట్టే ఉండేది. ఆ వీడియోలకు నవోమి బాగా ఎడిక్ట్‌ అయ్యింది. తల పైభాగం నుంచి భుజాల వరకు జలదరింపులను ఫీల్ అయ్యేది. కానీ.. జనాలకు అప్పటివరకు దానిగురించి పెద్దగా తెలియదు. అందుకే ఆమె అలా ఫీల్‌ అవుతున్నట్టు ఎవరికీ చెప్పేది కాదు. కానీ.. అప్పుడే ఆమెలో అలాంటి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలనే ఆలోచన మొదలైంది. 

యూట్యూబ్‌లోకి.. 

జెంటిల్‌ విస్పర్‌‌ ఛానెల్ ఇన్​స్పిరేషన్‌తో నవోమీ కూడా 2017లో ‘‘హున్నిబీ ఏఎస్‌ఎంఆర్” పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టింది. అయితే.. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంది. అందుకే ఫుడ్‌ నములుతూ అలాంటి ఏఎస్‌ఎంఆర్‌‌ సౌండ్స్‌ని క్రియేట్‌ చేస్తోంది. నవోమీ కూడా వీడియోల్లో గుసగుసలు పెట్టినట్టే మాట్లాడుతుంటుంది. ఫుడ్‌ తినేటప్పుడు వచ్చిన సౌండ్స్‌ని నాయిస్‌ లేకుండా రికార్డ్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా ఏఎస్‌ఎంఆర్‌‌ సౌండ్స్‌ కోసం జంక్‌ఫుడ్‌ తింటోంది. 

మొదట్లో ఆమె వీడియోలకు పెద్దగా రెస్పాన్స్ వచ్చేది కాదు. ఛానెల్‌ మొదలుపెట్టినప్పుడు ఆమె కాలిఫోర్నియాలోని క్రిస్టియన్ కాలేజీలో చదువుతుండేది. ఆ తర్వాత ఒకవైపు ఫిట్‌నెస్‌ రంగంలో పనిచేస్తూనే వీడియోలు చేసేది. అయితే.. ఏప్రిల్ 2019లో ఆమె ఛానెల్‌కు జనాదరణ పెరగడంతో వీడియోలు చేయడమే పనిగా పెట్టుకుంది. కాలిఫోర్నియా నుంచి కెనడాలోని అంటారియోకి మకాం మార్చేసింది. ఇప్పుడు ఛానెల్‌కు 8.68 మిలియన్ల సబ్‌స్క్రయిర్స్‌ ఉన్నారు. ఇప్పటివరకు 719 వీడియోలు అప్‌లోడ్‌ చేసింది. ఆమె చేసిన చాలా వీడియోలకు పది మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. హెయిర్ బ్రష్‌లు, షాంపైన్ బాటిల్స్, మాకరాన్‌లు లాంటి  చాక్లెట్ బార్‌లు తిన్న ఒక వీడియోకు ఏకంగా 96 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

కోట్లలో ఆదాయం

నవోమి చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్‌ వస్తుండడంతో డబ్బులు కూడా కోట్లలోనే సంపాదిస్తోంది. ఒక అంచనా ప్రకారం.. ఆమె యూట్యూబ్‌ వీడియోల ద్వారా నెలకు 7.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువే సంపాదిస్తోంది. 

ఏఎస్‌ఎంఆర్‌‌ ఎందుకు? 

‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నిద్రలేమి సమస్య ఉండేది. అప్పుడు ఏఎస్‌ఎంఆర్‌‌ సౌండ్స్‌ వింటే హాయిగా నిద్ర పట్టేది. అదొక్కటే కాదు చాలారకాలుగా ఈ సౌండ్స్‌ హాయిని ఇచ్చాయి. అందుకే ఇలాంటి వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. ఈ వీడియోలు నాకు సక్సెస్‌ని కూడా ఇచ్చాయి. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే నేను నా భర్తతో కలిసి అప్పుడప్పుడు వరల్డ్​ టూర్స్​కి వెళ్తున్నాం.