మీ కెప్టెన్‌‌‌‌, ప్లేయర్లతో వచ్చి ట్రోఫీ తీసుకోండి.. ఆసియా కప్‌‌‌‌ విషయంలో వెనక్కుతగ్గని నఖ్వీ

మీ కెప్టెన్‌‌‌‌, ప్లేయర్లతో వచ్చి ట్రోఫీ తీసుకోండి.. ఆసియా కప్‌‌‌‌ విషయంలో వెనక్కుతగ్గని నఖ్వీ
  • ఐసీసీలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్న బీసీసీఐ

ఆసియా కప్‌‌‌‌ గెలిచి దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ఇంకా కప్‌‌‌‌ మాత్రం టీమిండియా చేతికి అందలేదు. ఈ విషయంలో ఆసియా క్రికెట్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ (ఏసీసీ) ప్రెసిడెంట్‌గా ఉన్న మోహ్‌సిన్‌‌‌‌ నఖ్వీ (పాక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు చైర్మన్‌‌‌‌ కూడా) మొండి వైఖరిని వీడటం లేదు. దాంతో కప్‌‌‌‌ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 

అయితే ఈ విషయాన్ని సీరియస్‌‌‌‌గా తీసుకున్న బీసీసీఐ.. ఏసీసీ చైర్మన్‌‌‌‌ను తీవ్రంగా హెచ్చరించింది. సరైన పద్ధతిలో కప్‌‌‌‌ అందజేయాలని లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. దీనికి శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌ మద్దతుగా నిలిచాయి. ఆసియా కప్‌‌‌‌ ముగిసిన రెండు రోజుల తర్వాత జరిగిన ఏసీసీ ఏజీఎంలో కప్‌‌‌‌ అంశాన్ని బీసీసీఐ నఖ్వీ దృష్టికి తీసుకెళ్లింది. 

అయితే దుబాయ్‌‌‌‌ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో బీసీసీఐ ప్రతినిధి.. తన నుంచి కప్‌‌‌‌ అందుకోవాలని నఖ్వీ కోరగా దాన్ని ఇండియా బోర్డు తిరస్కరించింది. అప్పట్నించి కప్‌‌‌‌ దుబాయ్‌‌‌‌లోనే ఉంది. తనకు తెలియకుండా ఎవరికి దాన్ని ఇవ్వొద్దని అక్కడి ఆఫీసు సిబ్బందికి నఖ్వీ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. తాజాగా ఆసియా కప్‌‌‌‌ను తీసుకునేందుకు దుబాయ్‌‌‌‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని నఖ్వీ ప్రతిపాదించాడు. 

ఏసీసీ, బీసీసీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత వచ్చే నెల 10న ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ‘బీసీసీఐ నుంచి వరుసగా లేఖలు వచ్చాయి. నవంబర్‌‌‌‌ 10న జరిగే కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ప్లేయర్లు, బీసీసీఐ అధికారి రాజీవ్‌‌‌‌ శుక్లా వచ్చి నా నుంచి ట్రోఫీ స్వీకరించాలి’ అని కరాచీలో నఖ్వీ మీడియాకు వెల్లడించాడు. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.