దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర

దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌‌లో రీసెంట్‌‌గా ఓ ముస్లిం వృద్ధుడిపై ఆరుగురు దాడికి దిగిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. వృద్ధుడ్ని కొట్టిన దుండగులు.. ఆయన గడ్డాన్ని కూడా తొలగించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ ఘటనపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. దేశ సామరస్యతకు హాని కలిగించే ఎటువంటి చర్యలను తాము సహించబోమని నఖ్వీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై మతం రంగు పులమడం మీద ఆయన సీరియస్ అయ్యారు. 

‘భారత ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ సిండికేట్ మళ్లీ చురుగ్గా పని చేస్తోంది. దేశంలో సామరస్యతకు భంగం కలిగించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. యూపీ ఘటన చాలా దురదృష్టకరం. కానీ ఆ ఘటనకు కొందరు మతం రంగు పులుముతున్నారు. ఇలాంటి వాళ్లకు ఒక విషయం చెబుతున్నా.. దేశ ప్రతిష్టను దిగజర్చే ఇలాంటి కుట్రలు సక్సెస్ కావు. ఈ సిండికేట్ గతంలోనూ ఇలాంటి పనులే చేసింది. అవార్డులు తిరిగి ఇచ్చేయడం కూడా దీంట్లో భాగమే. దేశ సమగ్రతకు భంగం కలిగించే ఇలాంటి వారిని ప్రజలు, మన వ్యవస్థ ఎంతమాత్రం ఆమోదించవు’ అని నఖ్వీ చెప్పారు.