
వైఎస్సార్సీపీకి లోకేశ్ సవాల్
అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు భూములున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్ అన్నారు. బాలకృష్ణకు తక్కువ ధరకే ప్రభుత్వం భూములిచ్చిందని చెప్పడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో ఆయన భూములు కొనుగోలు చేసి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించకపోతే బహిరంగ క్షమాణపలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైఎస్సార్ సీపీ ఫేక్ బతుకు మారలేదని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదిగిన చరిత్ర జగన్ కే చెందుతుందని, తండ్రి సీఎంగా ఉన్నా ఏనాడూ అధికారం వైపు చూడని స్వచ్ఛమైన మనసు బాలకృష్ణదన్నారు. విలువలతో బతుకుతున్న బాలకృష్ణపై ఆరోపణలు చేయడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.