యాదగిరిగుట్టలో ముగిసిన నరసింహ జయంతి ఉత్సవాలు

యాదగిరిగుట్టలో ముగిసిన నరసింహ జయంతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.  మూడవ రోజు (ఆదివారం, మే 11) విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తి,  నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి తో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు అర్చకులు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు శుక్రవారం (మే 9)న మొదలైన ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. తొలి రోజు ఉదయం 8:45 గంటలకు కొత్త గుట్ట, పాత గుట్ట ఆలయాల్లో స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంకుమార్చన, మత్స్యగ్రహణం, అంకురార్పణ, హవనంతో జయంతి ఉత్సవాలను  అర్చకులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామికి పలు రకాల అలంకార సేవలు అందించారు. గుట్ట అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో కూడా ఏకకాలంలో ఉత్సవాలు నిర్వహించారు 

 రెండో రోజు శనివారం ఉదయం స్వామికి నిత్య పూజల తర్వాత  ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్ష పుష్పార్చన చేశారు. అనంతరం స్వామిని కాళీయ మర్దన శ్రీకృష్ణ అలంకారంలో వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలతో ముస్తాబు చేశారు.  ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం స్వామికి నిత్య కైంకర్యాల తర్వాత.. నృసింహ మూల మంత్ర హవనం, హనుమద్వాహం నిర్వహించారు. అనంతరం హనుమంతుడి వాహనంపై ఆలయ వీధుల్లో విహరింపజేశారు.

పాతగుట్ట క్షేత్రంలో కూడా  ఘనంగా జరిగాయి. కొండపైన సాంస్కృతిక, సంగీత, భజన, కూచిపూడి ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.  యాదగిరీశుడి జయంతి ఉత్సవాల చివరి రోజైన ఆదివారం నృసింహ జయంతి, ఆవిర్భావ ఘట్టంతో ముగియనున్నాయి.  కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.