ఈ నెలలోనే దసరా : అక్కడ ఇదే ప్రత్యేకత

ఈ నెలలోనే దసరా : అక్కడ ఇదే ప్రత్యేకత

నారాయణఖేడ్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పండగైన దసరా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వస్తుంటుంది. కానీ నారాయణఖేడ్ గిరిజనులు మాత్రం ఈ దసరా పండగను అత్యంత ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మే చివరి వారంలో జరుపుకొంటారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో అనేక గిరిజన తండాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో ఇక్కడి ప్రజలు విశిష్ట ఆచార సంప్రదాయాలు పాటిస్తుంటారు. శ్రమను నమ్ముకుని, ప్రకృతితో సాగిపోయే సంస్కృతి గిరిజనులలో మెండుగా ఉంటుంది. అందువల్ల వీరు జరుపుకొనే లంబాడా దసరా ఎంతో ప్రత్యేకమైంది. ఏడాదిపాటు వలస వెళ్లి సంపాదించిన డబ్బుల్లో సగం కంటే ఎక్కువ ఈ పండుగకు ఖర్చుపెడతారు. తమ బంధుమిత్రులు, స్నేహితులను పిలిచి విందు భోజనం పెడతారు. ప్రస్తుతం ఈ గిరిజన తండాల్లో ఇప్పటికే పండగ వాతావరణం కనిపిస్తోంది. బంధుమిత్రులు, పిల్లల సందడితో తండాలు కళకళలాడుతున్నాయి.

తుల్జాభవాని దర్శనం

లంబాడీలు సంవత్సరానికి ఒకసారైనా వారి కులదైవమైన మహారాష్ట్ర లోని తుల్జా భవాని మందిరానికి, పౌర ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మేడలో గవ్వలదండ వేసుకుంటారు. ఇలా ప్రతి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు పండగకు ముందు అమ్మవారి దర్శనానికి వెళతారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేవరకు నిష్టగా ఉంటారు. ఊరిబయట ఉన్న గుడి నుంచి నృత్యాలు, గానకచేరి చేసుకుంటూ ఇంటికి వస్తారు. తమ ఆహారం కోసం కోసిన మేక సగభాగాన్నిఅమ్మవారి ముందు ఉంచి, మిగిలిన సగభాగాన్ని వండుకొని బంధువులు, మిత్రులకు పెడతారు. అమ్మవారి ముందు ధాన్యం బస్తాలు ఉంచి, కాలం మంచిగా కావాలని అందరూ ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటారు. ఒకే రోజు ఈ దసరా పండగను అందరూ జరుపుకోవడం విశేషం. వివిధ పనుల కోసం వలస వెళ్లినవారంతా ఈ పండగ సమయంలో ఆత్మీయంగా కలుసుకుంటారు.