నారాయణపేట జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

 నారాయణపేట జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
  •     12.4 కిలోల గాంజా, 2 బైక్​లు, 
  •     రూ.10 వేల నగదు, 10 మొబైల్స్ స్వాధీనం
  •     నారాయణపేట ఎస్పీ వినీత్ వెల్లడి

మహబూబ్​నగర్, వెలుగు: అంతర్రాష్ర్ట గంజాయి ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ వినీత్​సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని కృష్ణ మండలం కున్సి గ్రామ శివారులో ఆదివారం ఎస్ఐ నవీద్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు బైకులపై ఐదుగురు అనుమానాస్పదంగా వచ్చారు. అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి దొరికింది. 

వారిచ్చిన సమాచారంతో కృష్ణ రైల్వే స్టేషన్ వద్ద మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వీరు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి గంజాయి ని రవాణా చేసి తెలంగాణలో అమ్ముతున్నట్టు అంగీకరించారు. అంతర్ రాష్ట్ర ముఠాగా ఏర్పడి రెండేండ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు చెప్పారు. నిందితుల్లో నారాయణ పేటకు చెందిన  సయ్యద్ అజార్ అలీ, మహమ్మద్ సుఫియాన్ షా, కనిగిరి విశాల్, కర్ణాటకలోని యాద్గీర్ కు చెందిన ఉమేశ్, సోనియా, లల్లన్, సమీర్ సయ్యద్, మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన తుకారాం, సమీర్, అక్షయ్ ఉన్నారు. 

వీరి వద్ద 12.4 కిలోల గంజాయి, రెండు బైక్​లు, రూ.10 వేల నగదు, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మక్తల్ సీఐ రామ్ లాల్, కృష్ణ ఎస్ఐ నవీద్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు. ముఠాను పట్టుకున్నవారికి రివార్డు అందించనున్నట్టు  ఎస్పీ పేర్కొన్నారు.