సివిల్స్‌‌లో తెలంగాణ ఆడబిడ్డకు మూడో ర్యాంక్

సివిల్స్‌‌లో తెలంగాణ ఆడబిడ్డకు మూడో ర్యాంక్
  • సత్తా చాటిన నారాయణపేట ఎస్పీ కూతురు ఉమాహారతి
  • తొలి 4 ర్యాంకులూ అమ్మాయిలకే
  • టాపర్‌‌‌‌గా యూపీకి చెందిన ఇషిత
  • మొత్తంగా 933 మంది ఎంపిక.. వీరిలో అబ్బాయిలు 613 మంది
  • పదుల సంఖ్యలో ర్యాంకులు సాధించిన తెలుగు అభ్యర్థులు

హైదరాబాద్, నెట్‌‌వర్క్, వెలుగు: సివిల్స్‌‌లో వరుసగా రెండో ఏడాదీ అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులను వాళ్లే సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఇషిత కిషోర్‌‌ ఆలిండియా సివిల్స్ టాపర్‌‌‌‌గా నిలవగా.. తెలంగాణ ఆడబిడ్డ ఉమాహారతి థర్డ్ ర్యాంక్ సాధించారు.  ఈమె నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు. గరిమా లోహియా(బీహార్) రెండో ర్యాంకు, స్మృతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. టాప్ 25 ర్యాంకుల్లోనూ 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. మొత్తంగా 933 మంది క్వాలిఫై కాగా.. అందులో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్ – 2022 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం రిలీజ్ చేసింది. హనుమకొండకు చెందిన 23 ఏండ్ల శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్.. తొలి ప్రయత్నంలోనే 40వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 263 మంది ఓబీసీ, 154 మంది ఎస్సీ, 99 మంది ఈడబ్ల్యూఎస్, 72 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. 


సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌‌‌‌కు చెందిన సంకేత్ కుమార్ 35, హనుమకొండకు చెందిన శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్ 40వ ర్యాంకు సాధించారు. శ్రీప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణ (పెద్దపల్లి) 94, నిధిపై 110,  శివమారుతీ రెడ్డి (జగిత్యాల) 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్ కుమార్ 200, రావుల జయసింహా 217, శ్రావణ్ కుమార్ 222, బొల్లం ఉమామహేశ్వర్‌‌‌‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాల్వాయి విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మీసుజిత 311,  హర్షిత 315, ఎన్‌‌‌‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి 362, ఇప్పలపల్లి సుష్మిత 384, డొంగ్రె రేవయ్య 410, సీహెచ్‌‌‌‌ శ్రావణ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి 426, భానుప్రకాశ్ 448, పి.సాయికిరణ్ 460, బొల్లిపల్లి వినూత్న 462,  రేవంత్ 469, లక్ష్మీకాంత్ 473 ర్యాంకులతో సత్తా చాటారు. హిమవంశీ 548, రిత్విక్ సాయి కొట్టే 558, ఎర్రంశెట్టి యూఎస్ఎల్ రమణి 583, హేమంత్ 593, సృష్టిదీప్ 600, దీప్తి చౌహాన్ 630, తుమ్మల సాయికృష్ణారెడ్డి 640, రాహుల్ 686, పుసులూరు రవికిరణ్ 694, ర్యాంకు, రాందేని సాయినాథ్ 742, అక్షయ్ దీపక్ 759, పి. భార్గవ్ 772, శ్రీకాంత్ రెడ్డి 801, మనవ్ సుజిత్ 805, విజయ్ బాబు 827, కొయ్యడ ప్రణయ్ కుమార్ 885 ర్యాంకులు సాధించారు. సివిల్స్ ఫలితాల్లో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీకి చెందిన 18 మంది ర్యాంకులు సాధించారని, వారిలో 22, 40, 200 ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ బాల లత తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో తమ సంస్థకు చెందిన అభ్యర్థులే ఫస్ట్, సెకండ్ ర్యాంకులతో పాటు 73 మంది సివిల్స్ ర్యాంకులు పొందారని ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ చైర్మన్ తేజ్ స్వరూప్ చెప్పారు. సివిల్స్ ఫలితాల్లో తమ అభ్యర్థులు 25 మంది ర్యాంకులు పొందారని లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఐఆర్ఎస్ వచ్చినా వదులుకుని..

సివిల్స్‌‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన ఉమా హారతి.. నారాయణపేట ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు కూతురు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌‌‌‌లోని సీతారాంనగర్ కాలనీకి చెందిన ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పని చేస్తున్నారు. ఆయన కూతురు ఉమాహారతి 10వ తరగతి వరకు హైదరాబాద్‌‌లోని  భారతీయ విద్యా భవన్‌‌లో చదువుకున్నారు. నారాయణ కాలేజీలో ఇంటర్ చదివి స్టేట్ ర్యాంక్ సాధించారు. బాంబే ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐదుసార్లు ప్రిలిమ్స్ రాయగా.. రెండుసార్లు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. మొదటిసారి ఇంటర్వ్యూలో ఐఆర్ఎస్ రాగా దాన్ని వదులుకున్నారు. ఈసారి 3వ ర్యాంకు సాధించారు. హారతి తమ్ముడు సాయి వికాస్ కూడా ఐఈఎస్(ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌‌)లో ఆలిండియా 12వ ర్యాంకు సాధించారు. ఈ నెల 22నే ముంబైలో ఉద్యోగంలో చేరారు. కాగా, హారతికి స్వీట్లు తినిపించి ఆమె తల్లిదండ్రులు అభినందించారు. ఉమాహారతికి నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ విషెస్ చెప్పారు. తన కూతురు 3వ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందని వెంకటేశ్వర్లు అన్నారు.

ఐదేండ్లుగా ప్రిపేర్ అయితున్న: ఉమా హారతి

‘‘మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నా. 3వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. ఈ విజయం తల్లిదండ్రులు, తమ్ముడి సహకారంతో వచ్చింది. బీటెక్ పూర్తి అయినప్పటి నుంచి సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో చదివా. 2018లో ఢిల్లీలో 9 నెలలు కోచింగ్ తీసుకున్నా. తర్వాత ఇంటి దగ్గరే చదువుకున్నా. ఎప్పటికప్పుడు ఇంటర్​నెట్‌‌లో సిలబస్ చెక్ చేస్తూ, పాత క్వశ్చన్ పేపర్స్‌‌ను తిరిగేశా. సివిల్స్ ర్యాంకులు సాధించిన నా ఫ్రెండ్స్ ప్రిపరేషన్‌‌లో సాయం చేశారు. ఐదేళ్లుగా సివిల్స్ అటెండ్ అవుతున్నా. ప్రతి అపజయం.. మనల్ని మనం తెలుసుకునేట్టు చేస్తుంది. భయపడకుండా ముందుకు సాగాలి. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లు జాగ్రత్తగా, ఇష్టపడి చదివితే విజయం వరిస్తుంది. సివిల్స్ ఒకసారితో వచ్చేది కాదు. లాంగ్​టర్మ్ ప్రిపరేషన్ అవసరం’’

గతేడాదీ టాప్ 3లో మహిళలే

వరుసగా రెండో ఏడాది మహిళలే టాప్ ర్యాంకులు సాధించారు. సివిల్స్ – 2021 ఫలితాల్లో స్మృతి శర్మ, అంకిత అగర్వాల్, గామిని సింగ్లా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 

టాప్ 10 ర్యాంకర్లు
1.ఇషిత కిషోర్
2.గరిమ లోహియా
3.ఉమా హారతి ఎన్
4.స్మృతి మిశ్రా
5.మయూర్ హజారికా
6.గహనా నవ్య జేమ్స్
7.వసీం ఆహ్మద్ భట్
8.అనిరుధ్ యాదవ్
9.కనిక గోయల్
10.రాహుల్ శ్రీ వాస్తవ
ర్యాంకు ఊహించలే
మాది హనుమకొండ. టెన్త్ వరకు వరంగల్ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో చదివా. ఇంటర్ హైదరాబాద్‌‌‌‌లో చేసి, బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేశా. కరోనా టైమ్ నుంచి ఆన్​లైన్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్న. చాలామంది సహకారంతో ఈ ర్యాంకు సాధించా. అయితే 40వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. అమ్మానాన్నల సహకారం మరువలేనిది.
- శ్రీసాయి ఆశ్రిత్ (40వ ర్యాంక్)

బాబాయి కోరిక నెరవేర్చేందుకు..

కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతీ రెడ్డి 132వ ర్యాంక్​ సాధించారు. చనిపోయిన తన బాబాయి కోరక నెరవేర్చేందుకు.. ఐదేండ్ల పాటు చదివి సివిల్స్​కు ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు. శివ మారుతి తండ్రి రాజారెడ్డి మల్లాపూర్ మండలం గుండంపల్లి సర్కార్ స్కూల్లో టీచర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత వ్యవసాయ పనులు చూసుకుంటారు.

కేయూ ప్రొఫెసర్ బిడ్డకి 646వ ర్యాంక్

కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాల్లో 646వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన మంద అపూర్వ.. ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో వీరు నివసిస్తున్నారు. అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ లో పనిచేస్తున్నారు.

రెండో ప్రయత్నంలోనే..

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేట గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్.. 35వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌‌లో హార్టికల్చర్​డిపార్ట్​మెంట్​లో డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న ప్రేమ్ సింగ్​నాయక్ కొడుకు సంకేత్​కుమార్.. ఢిల్లీ ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. 2021లో మొదటిసారి యూపీఎస్సీ ఎగ్జామ్​రాసి ఇంటర్వ్యూకు దాకా వెళ్లారు. ఇప్పుడు రెండో ప్రయత్నంలోనే 35వ ర్యాంకు సాధించారు.

లెక్చరర్‌‌‌‌గా పని చేస్తూనే..

నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన కంటం మహేశ్ కుమార్ 200వ ర్యాంకు సాధించారు. ఆరో ప్రయత్నంలో ఆయన సక్సెస్​అయ్యారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీఎస్సీ చేసిన మహేశ్.. ఢిల్లీలోని జేఎన్‌‌యూలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ప్రస్తుతం చైనీస్ పాలిటిక్స్​మీద పీహెచ్​డీ చేస్తున్నారు. ఆయన తండ్రి రాములు ట్రాన్స్​కో ఉద్యోగి కాగా, తల్లి యాదమ్మ  వైద్య శాఖలో పనిచేస్తున్నారు. 

భగవత్ గైడెన్స్‌‌లో 150 మందికి ర్యాంకులు

సివిల్స్ ట్రైనింగ్‌‌లో సీఐడీ చీఫ్‌‌ మహేశ్ భగవత్‌‌ మరోసారి తన మార్క్ చూపారు. ఆయన గైడెన్స్‌‌ ఇచ్చిన అభ్యర్థుల్లో 150 మంది వరకు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలో రాచకొండ సీపీగా విధులు నిర్వహిస్తూనే.. సివిల్స్‌‌కి ప్రిపేర్‌‌‌‌ అవుతున్న అభ్యర్థులకు మహేశ్ భగవత్‌‌ ఇంటర్వ్యూ సబ్జెక్ట్‌‌పై ట్రైనింగ్ ఇచ్చారు. వాట్సాప్‌‌ గ్రూప్స్‌‌లో సుమారు 700 మందిని గైడ్‌‌ చేశారు. ఈ ఏడాది ట్రైనింగ్‌‌ పొందిన 700 మందిలో 125 మంది నుంచి 150 మంది ర్యాంకులు సాధించారు. 

మహిళా సాధికారత కోసం పని చేస్త

సివిల్స్‌‌‌‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం తనకు సంతోషంగా ఉందని, తన కల నెరవేరిందని 26 ఏండ్ల ఇషిత కిషోర్ చెప్పారు. తాను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మహిళా సాధికారత కోసం పని చేస్తానని చెప్పారు. ఇషిత తన మూడో ప్రయత్నంలో సివిల్స్‌‌‌‌కు అర్హత సాధించారు. ఇషిత తండ్రి ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్ ఆఫీసర్ కాగా, తల్లి ప్రైవేట్ స్కూల్ టీచర్, అన్న లాయర్. ప్రోత్సహించారని చెప్పారు. 

మరోసారి ప్రయత్నించి..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మంAడలం గర్రెపల్లికి చెందిన లక్ష్మయ్య, సునీత కుమారుడు సాయికృష్ణకు సివిల్స్ లో 94వ ర్యాంకు వచ్చింది. ‌‌ప్రస్తుతం వీరి ఫ్యామిలీ కరీంనగర్ సిటీలోని కట్టా రాంపూర్‌‌‌‌లో ఉంటోంది. సాయికృష్ణ గతంలో 728వ ర్యాంకు సాధించగా మరోసారి ప్రయత్నించి 94వ ర్యాంకు సాధించారు. వరంగల్ నిట్‌‌లో బీటెక్ పూర్తి చేసిన సాయికృష్ణ.. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు.

తల్లి కష్టానికి ప్రతిఫలం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి రేవయ్య.. 410వ ర్యాంక్ సాధించారు. రేవయ్యకు నాలుగేండ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోగా.. తల్లి ఇస్తారు బాయి కష్టపడి చదివించింది. గవర్నమెంట్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వంట పని చేస్తూ రేవయ్యను ప్రయోజకుడిని చేసింది. రేవయ్య హైదరాబాద్ నాగోల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్నారు.