
హైదరాబాద్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి చెందిన వార్త తెలుసుకొని చాలా బాధపడ్డానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం గద్దర్ భార్య విమల, కుటుంబ సభ్యులకు మోదీ లేఖ రాశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయన్నారు.
ఆయన రచనలు, పాటలు ప్రజలను ఎంతో ఎంకరేజ్ చేశాయని గుర్తుచేశారు. తెలంగాణ సంప్రదాయ కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో గద్దర్ చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని తెలిపారు. వారి దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని లేఖలో పేర్కొన్నారు.