వేల కోట్ల ఆస్తిపై కన్ను.. సవతి తల్లిపై కోర్టు కెక్కిన హీరోయిన్ పిల్లలు

వేల కోట్ల ఆస్తిపై కన్ను.. సవతి తల్లిపై కోర్టు కెక్కిన హీరోయిన్ పిల్లలు

బాలీవుడ్‌లో మరో సంచలనాత్మక ఆస్తి వివాదంగా తెరపైకి వచ్చింది.  సినీ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ న్యాయ పోరాటానికి దిగారు.  తమ తండ్రి, దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తిలో తమకు రావాల్సిన వాటా కోసం వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుమారు రూ. 30,000 కోట్లు విలువ చేసే ఈ భారీ ఆస్తి కోసం వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సమైరా, కియాన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, తమ సవతి తల్లి ప్రియా కపూర్ చూపించిన మార్చి 21, 2025 నాటి వీలునామా నకిలీదని, అది కావాలని సృష్టించిందని ఆరోపించారు. ప్రియా కపూర్ ఈ పత్రాన్ని ఏడు వారాల పాటు రహస్యంగా దాచిపెట్టి, ఆ తర్వాతే బయటపెట్టిందని వారు పేర్కొన్నారు. ఈ కేసులో సమైరా, కియాన్ తరపు న న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, సంజయ్ కపూర్ ఆస్తిలో ఇద్దరు పిల్లలకూ చెరో 20 శాతం వాటా ఇవ్వాలని కోర్టును కోరారు. కేసు పరిష్కారమయ్యే వరకు ఆస్తుల బదిలీని నిలిపివేయాలని, తద్వారా వాటిని ఎవరూ దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించారు.

కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003లో వివాహం చేసుకుని 2016లో విడాకులు తీసుకున్నారు. వారిద్దరికీ కలిగిన ఇద్దరు పిల్లలే సమైరా, కియాన్.  కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్... ప్రియ సచ్ దేవ్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించారు.  అప్పటి నుంచి సంజయ్ కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది.  ప్రస్తుతం, వీరు తమ తండ్రి ఆస్తి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు.  తమ తండ్రి ఆస్తిలో వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ ఆస్తి వివాదం బాలీవుడ్, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.