అక్టోబర్‌ 1న పాలమూరులో మోదీ సభ

అక్టోబర్‌ 1న పాలమూరులో మోదీ సభ
  • భారీ జన సమీకరణకు
  • బీజేపీ నాయకుల ఏర్పాట్లు
  • పాలమూరు నుంచే ఎన్నికల
  • ప్రచారం ప్రారంభించనున్న మోదీ
  • ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ ఆటలు
  • తెలంగాణలో సాగవు: జితేందర్‌‌రెడ్డి

హైదరాబాద్ / మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : అక్టోబర్‌ 1న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. పాలమూరు వేదికగా బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల నగారా మోగించనున్నారు. మహబూబ్ నగర్ శివారులోని భూత్పూర్ ఐటీఐ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. కనీసం లక్ష మంది హాజరయ్యేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. సభ సక్సెస్‌పై శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులతో.. రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి సమావేశమయ్యారు. సభా స్థలిని పరిశీలించారు. ఏర్పాట్లను స్పీడప్ చేయాలని సూచించారు.

మోదీ పర్యటనను సక్సెస్ చేద్దాం: జితేందర్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మొదటిసారి పాలమూరుకు వస్తున్న ప్రధాని మోదీకి మహిళలతో భారీగా ఘనస్వాగతం పలికి అభినందనలు తెలుపుతామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీజేపీ మహబూబ్​నగర్​ జిల్లా ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల శంఖారావం మహబూబ్​నగర్ నుంచి మొదలవుతుందని చెప్పారు. మోదీ పర్యటనను సక్సెస్ చేద్దామని కోరారు.

ఎన్నికల హడావుడిలో భాగంగానే సీఎం కేసీఆర్ పూర్తి కాని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో 31 పంపులకు గాను ఒక్క పంపును ప్రారంభించారని విమర్శించారు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచే ఆ ఒక్క పంపు కూడా పని చేయడం లేదని అన్నారు. మీడియా సమావేశంలో నాయకులు ప్రేమేందర్.జి, తల్లోజు ఆచారి, రవీంద్రనాథ్ రెడ్డి, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అగ్ర నేతల వరుస టూర్లు

అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే అగ్ర నేతల టూర్లు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాగా.. రెండు వారాల్లోనే మోదీ రానున్నారు. అంతకుముందు జులై 8న వరంగల్‌‌‌‌లో కాజీపేట్ రైల్వే పీఓహెచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ప్రధాని హాజరయ్యారు.

ఇక అక్టోబర్ 10 లోపు అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా టూర్లను ఖరారు చేసే పనిలో రాష్ట్ర నేతలు ఉన్నారు. కనీసం 25 నుంచి30 మందితో కూడిన ఫస్ట్ లిస్టు కేంద్ర నాయకత్వం వద్ద రెడీగా ఉందని, అక్టోబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మోదీ టూర్ తర్వాత ప్రచారాన్ని రాష్ట్ర నాయకత్వం స్పీడప్ చేయనుందని చెప్తున్నాయి.