చివరి దాకా సస్పెన్స్​ : కేబినెట్​ ఏర్పాటుపై మోడీ, షా చర్చల మీద చర్చలు

చివరి దాకా సస్పెన్స్​ : కేబినెట్​ ఏర్పాటుపై మోడీ, షా చర్చల మీద చర్చలు

న్యూఢిల్లీకేంద్ర కేబినెట్​ ఏర్పాటు విషయంలో చివరి వరకు సస్పెన్స్​ కొనసాగింది. ప్రమాణస్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు ఎంపీలకు ఫోన్లు వెళ్లాయి. స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్​ షానే పలువురికి ఫోన్లు​ చేసి.. ‘కంగ్రాట్స్​. మీకు మంత్రి పదవి వచ్చింది. ప్రమాణం చేయడానికి రెడీగా ఉండండి’ అని చెప్పారు. పీఎంవో నుంచి కూడా పలువురికి ఫోన్లు వెళ్లాయి. మంత్రివర్గ కూర్పుపై మోడీ, అమిత్​ షా మూడురోజులుగా చర్చల మీద చర్చలు జరిపారు. గురువారం కూడా ఇద్దరు నేతలు పలు దఫాలు సమావేశమయ్యారు. ఎవరెవరకి అవకాశం ఇవ్వాలి? ఎన్డీయేలోని ఏఏ పార్టీకి ఎన్ని బెర్త్​లు కేటాయించాలి? ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతమందికి చాన్స్​ కల్పించాలి? మొత్తం మంత్రులు ఎంత మంది ఉండాలి? అనే విషయాలపై చర్చించారు. రెండుమూడురోజులుగా కేబినెట్​లో వీళ్లు ఉండొచ్చంటూ వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఎక్కడా వీరే ఫైనల్​ అని చివరి వరకు కన్ఫామ్​ కాలేదు.

ఎంపీలను ముందే ప్రిపేర్​ చేసిన మోడీ

మంత్రి పదవి వచ్చిందని సాక్షాత్తు పీఎంవో నుంచి ఫోన్​ వచ్చినా ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకోవాలంటూ ఎన్డీయే నేతగా ఎన్నికైన రోజే ఎంపీలకు నరేంద్ర మోడీ హితవుపలికారు. ప్రధానమంత్రి, మంత్రి.. ఇలా హోదాలు ముఖ్యం కాదని, ఎంపీగా నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఆశలు పెంచుకోవద్దని, పుకార్లు నమ్మొద్దని సూచించారు. ఈ రకంగా ముందే ఎంపీలందరినీ మోడీ ప్రిపేర్​ చేశారు.

మిత్రపక్షాలకు బెర్త్​లపై చర్చలు

ఒంటరిగానే బీజేపీ అధికారానికి కావాల్సిన సీట్లను క్రాస్​ చేసినప్పటికీ రెండోసారి కూడా ఎన్డీయేగానే పాలన కొనసాగించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ కూటమిలోని పార్టీలకు ఎన్ని బెర్త్​లు కేటాయించాలన్నదానిపై మోడీ, షా చర్చలు జరిపారు. మహారాష్ట్రలో 18 సీట్లు గెలిచిన శివసేన, బీహార్​లో 16 సీట్లు గెలిచిన జేడీయూ వంటి పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై వారు సమాలోచనలు సాగించారు. అయితే.. జేడీయూ మాత్రం ప్రభుత్వంలో చేరబోమని, ఎన్డీయేలోనే ఉంటామని స్పష్టం చేసింది. మొన్నటి కేబినెట్​లో పనితీరును బట్టి కొందరు పాత మంత్రులను కొత్త కేబినెట్​ అవకాశం కల్పించారు. ప్రతిపక్షంలోని కీలక నేతలను ఎన్నికల్లో ఓడించిన పార్టీ నేతలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. అందులో అమేథిలో కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ, ఒకప్పటి బీజేపీ నేత జశ్వంత్​ సింగ్​ కుమారుడు మన్వేంద్రసింగ్​ను ఓడించిన బర్మర్​ ఎంపీ కైలాష్‌​ చౌదరి వంటి వారి పేర్లను కేబినెట్​ లిస్టులో ముందుగానే చేర్చినట్లు తెలుస్తోంది.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టిన రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్​ పెట్టి ఆ రాష్ట్రాల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదానిపై మోడీ, షా చర్చలు సాగించారు. బెంగాల్, ఒడిశాలో పార్టీ బలం పుంజుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎవరెవరికి పదవులు ఇవ్వాలనేదానిపైనా చర్చించారు. ఇలా మూడు రోజులపాటు మోడీ, అమిత్​ షా చర్చలు జరిపి.. గురువారం మధ్యాహ్నం వరకు లిస్టును ఫైనల్​ చేశారు. మీడియాకు మాత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని నిమిషాల ముందే ఆ పేర్లను విడుదల చేశారు. మంత్రుల పేర్ల విషయంలో, వారి పోర్టు ఫోలియోల విషయంలో గోప్యతను పాటించారు.