
భువన్వేశర్: భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, ఆయన భార్య అర్పిత గంగూలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తోన్న స్పీడ్ బోట్ అలల ధాటికి సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే అలర్ట్ అయిన రెస్య్కూ టీమ్ గంగూలీ అన్న వదినను రక్షించారు. దీంతో వీరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
గంగూలీ సోదరుడు స్నేహాశిష్ అతని భార్య అర్పిత ఆదివారం (మే 25) ఒడిశాలోని పూరి తీరంలో విహార యాత్రకు వెళ్లారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా స్పీడ్ బోట్ ఎక్కి సముద్రంలో చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో సముద్ర అలలకు వీరు ప్రయాణిస్తోన్న స్పీడ్ బోట్ ఒక్కసారిగా నీటిలో బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన లైఫ్‌గార్డ్‌లు రబ్బరు ఫ్లోట్‌లతో గంగూలీ అన్నవదినను ప్రాణాలతో కాపాడారు.
చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన అర్పితా గంగూలీ.. ఈ ఘటనను తల్చుకుని భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికుల తక్కువగా ఉండటంతో పడవ తేలికగా ఉందని.. అందుకే బోట్ బోల్తా పడిందని ఆరోపించారు. పడవలో 10 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. డబ్బు కోసం ముగ్గురు నుంచి నలుగురిని ఎక్కించుకున్నారని అన్నారు. ఆ రోజు సముద్రంలోకి వెళ్లడానికి అదే చివరి బోట్. అప్పటికే సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది.. సముద్రంలోకి వెళ్లడంపై వెళ్లడంపై మేము ఆందోళన వ్యక్తం చేశాం.
కానీ ఏం పర్వాలేదని చెప్పి బోట్ ఆపరేటర్లు మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్లారు. సముద్రంలోకి వెళ్ళిన వెంటనే ఒక పెద్ద అల పడవను ఢీకొట్టడంతో బోట్ బోల్తా పడిందని ఆరోపించారు. లైఫ్‌గార్డ్‌లు సమయానికి రాకపోతే ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని.. నేను ఇంకా ఆ షాక్ లోనే ఉన్నానని అర్పితా గంగూలీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పడవలో ఎక్కువ మంది ఉంటే బహుశా అది బోల్తా పడి ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.