‘ఆర్టిమిస్’ మిషన్ లీక్

‘ఆర్టిమిస్’ మిషన్ లీక్

చందమామపై స్థిరమైన బేస్ కట్టుకోవడానికి నాసా 37 ప్రయోగాలు చేపట్టనుంది. 2028 నాటికి ఈ ‘ఆర్టిమిస్‌‌‌‌’ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఆర్స్ టెక్నికా అనే కంపెనీ ఇందుకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా లీక్ చేసింది. ఫ్లైట్ టెస్టులు, మానవ సహిత ప్రయోగాలు,  లూనార్ ల్యాండింగ్ ఇలా 2019 నుంచి 2024 వరకూ చేయాలనుకుంటున్న పనుల వివరాలు వాటిలో పూస గుచ్చినట్లు ఉన్నాయి. భవిష్యత్‌‌‌‌లో వెన్నెల మీదకు వెళ్లే ఆస్ట్రోనాట్లు ఉండటానికి ఓ స్థిరమైన బేస్ ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. చివరి దశలో ఈ ప్లాన్‌‌‌‌ను అమలు చేస్తారు. కాగా దీనికి సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే మొదలై ఉంటాయని ఆర్స్ టెక్నికా వివరించింది. ఆర్టిమిస్‌‌‌‌ మిషన్ కు ఏటా కనీసం రూ. 41.7 లక్షల కోట్లు నుంచి రూ. 55.6 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆర్స్ టెక్నికా అంచనా వేసింది.  మొన్నటికిమొన్న కళాశాలల ఫండింగ్ కోసం ఉంచిన 160 కోట్ల డాలర్ల నిధులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్టిమిస్‌‌‌‌కు మళ్లించారు.

ఈ మిషన్ కోసం భారీ మొత్తం ఖర్చు చేయడంపై అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చైనా కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద స్థిరమైన బేస్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2020 కల్లా బేస్ తయారీని మొదలుపెట్టేందుకు అవసరమైన సామగ్రిని జాబిల్లి మీదకు చేర్చాలని అనుకుంటోందనే రిపోర్టులు ఉన్నాయి. ఆర్టిమిస్ మిషన్ కోసం ప్రొటోటైపులు, డిజైన్ల తయారీ కోసం బోయింగ్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, నార్త్ రాప్ గ్రమ్మన్ లాంటి 11 కంపెనీలను నాసా ఇప్పటికే ఎంపిక చేసింది. చంద్రుడిపై మనిషి బతకడానికి వీలయ్యే వాతావరణం లేకపోయినా ప్రపంచదేశాలు అక్కడ పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. ఇనుము, యురేనియం లాంటి వనరులు చంద్రుడి భూమిలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని చందమామ నుంచి కిందికి తీసుకురావాలన్నదే అసలైన లక్ష్యం.