
జస్ట్ అంగుళం లోతులోనే ఉన్నాయన్న నాసా సైంటిస్టులు
అంగారక గ్రహంపై నీళ్లున్నాయా? ఈ ప్రశ్నపైనే చాలా మంది సైంటిస్టులిప్పుడు పరిశోధనలు చేస్తున్నది. ఇప్పటికే నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్, మార్స్‌పై కలియతిరుగుతూ ఫొటోలు పంపుతూ రీసెర్చ్‌లో ఓ చెయ్యి వేస్తోంది. అయితే, మార్స్‌లో ఒకప్పుడు నీళ్లుండేవని, అవన్నీ ఇప్పుడు పోయాయని సైంటిస్టులు ఎప్పుడూ చెబుతున్న మాట. కానీ, ఇప్పుడు ఆ మాట మారింది. మార్స్ లోపల నీళ్లున్నాయన్నది ఆ మాట. అది కూడా అంగారక గ్రహం ఉపరితలం నుంచి కేవలం ఒక అంగుళం లోతులో మాత్రమే ఉన్నాయన్న మాట. ఈ తాజా మాట నాసా సైంటిస్టులే తేల్చి చెబుతున్నారు. దానికి సంబంధించిన మ్యాపులనూ విడుదల చేశారు. మార్స్ అర్కడియా ప్లానిషియా హెమీస్ఫియర్ వద్ద అంగుళం లోపలే ఐస్ రూపంలో నీళ్లున్నాయని తేల్చారు. అంతేగాకుండా రెండు అడుగుల లోతులోనూ నీళ్లు గడ్డకట్టి ఉన్నట్టు గుర్తించారు. ధ్రువాలతో పాటు మధ్య అక్షాంశాల వద్ద కూడా నీటి జాడను కనుగొన్నారు. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్, మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్లు తీసి పంపిన ఫొటోలు, సేకరించిన సమాచారం ఆధారంగా సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఒడిస్సీ ఆర్బిటర్‌లోని గామా రే స్పక్ట్రోమీటర్ సేకరించిన డేటా ఆధారంగా మ్యాపులను క్రియేట్ చేశారు. చంద్రుడి లాగానే మార్స్ మీద కూడా కొన్ని ప్రదేశాలు బతికేందుకు అనువుగా ఉండవని చెబుతున్నారు. టెంపరేచర్లు, సూర్యుడి వెలుతురు వంటి ఫ్యాక్టర్లే ప్రభావం చూపుతాయంటున్నారు.