సివర్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌.. డబ్ల్యూపీఎల్‌‌లో తొలి సెంచరీతో ముంబై బ్యాటర్ రికార్డు.. 15 రన్స్ తేడాతో ఆర్సీబీపై గెలుపు

సివర్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌.. డబ్ల్యూపీఎల్‌‌లో తొలి సెంచరీతో ముంబై బ్యాటర్ రికార్డు.. 15 రన్స్ తేడాతో ఆర్సీబీపై గెలుపు

వడోదర: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌)లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ నటాలీ సివర్ బ్రంట్ (57 బాల్స్‌‌లో 16 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 100 నాటౌట్‌‌) లీగ్ చరిత్రలోనే తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌‌‌‌గా రికార్డుకెక్కింది.  సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌‌లో ఆమె ఈ ఘనత సాధించింది. దాంతో ముంబై  15  రన్స్ తేడాతో  విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.  తొలుత ముంబై 20 ఓవర్లలో 199/4 భారీ స్కోరు సాధించింది. మూడో ఓవర్లోనే ఓపెనర్ సజన (7) ఔటైనా.. వన్‌‌డౌన్‌‌ బ్యాటర్ బ్రంట్‌‌ సత్తా చాటింది.

మరో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (39 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 5)  రెండో వికెట్‌‌కు 131 రన్స్ భారీ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ నెలకొల్పింది. ముఖ్యంగా మిడిల్‌‌ ఓవర్లలో సివర్ బ్రంట్ భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 32 బాల్స్‌‌లో ఫిఫ్టీ అందుకుంది. 15వ ఓవర్లో హేలీ ఔటైన తర్వాత కెప్టెన్ హర్మన్‌‌ ప్రీత్ (20)తో జోరు కొనసాగించిన బ్రంట్.. లాస్ట్ ఓవర్లో సెంచరీ అందుకుంది. జార్జియా వోల్‌‌, సోఫీ డివైన్‌‌ (99 రన్స్) పేరిట ఉన్న హయ్యెస్ట్ స్కోరు రికార్డును బ్రేక్ చేసింది.

ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీసింది. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో రిచా ఘోశ్ (50 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 90) అదరగొట్టినా ఆర్సీబీ  20 ఓవర్లలో 184/9 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్లు గ్రేస్ హారిస్ (15), మంధాన (6)తో పాటు జార్జియా వోల్ (9), గౌతమి నాయక్ (1), రాధా యాదవ్ (0) ఫెయిలయ్యారు. నడిన్ డిక్లెర్క్ (28)తో కలిసి రిచా ధాటిగా ఆడింది. 

చివర్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్  మూడు, షబ్నిమ్ ఇస్లాయిల్ రెండు వికెట్లు పడగొట్టారు. సివర్ బ్రంట్‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు  రిపబ్లిక్‌‌ డే సందర్భంగా స్టేడియంలో నిర్వహించిన సెలబ్రేషన్స్‌‌ ఆకట్టుకున్నాయి.