
నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ (61) శనివారం కన్నుమూశారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ముందుగా మరాఠీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన గైక్వాడ్ ఆ తర్వాత బాలీవుడ్‌లో పాపులర్ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు. పానిపట్, బెల్‌బాటమ్, ఉరి, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్30, కేదార్ నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరుని తీసుకు వచ్చాయి.
‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దత్తాను ఇందిరా గాంధీగా చూపించిన తీరు అందర్నీ మెప్పించింది. 2010లో ‘మోనేర్ మనుష్’ అనే బెంగాలీ చిత్రానికి గానూ మొట్టమొదటిసారిగాయ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకోగా, ఆ తర్వాత 2011లో ‘బాలగంధర్వ’ అనే మరాఠీ మూవీతో పాటు హిందీ సినిమా ‘ద డర్టీ పిక్చర్’కు ఆయన నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత 2013లో ‘జాటీశ్వర్’ అనే బెంగాలీ మూవీకి మరోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.
అలాగే పలు సినిమాలకు ఐఐఎఫ్‌ఏ, ఎఫ్‌ఓఐ పురస్కారాలు ఆయన్ని వరించాయి. అంతేకాదు పలు చిత్రాల్లో నటుడిగానూ గైక్వాడ్ మెప్పించారు. విక్రమ్ గైక్వాడ్ మృతి పట్ల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భారతీయ సినిమా, నాటక రంగానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. గైక్వాడ్ మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.